భీమవరం: రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. బలరామ్, ఆలిండియా అగ్రగామి కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి పీవీ సుందరరామరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం భీమవరం హెడ్‌పోస్టాఫీసు వద్ద నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో వారు మాట్లాడారు. ముందుగా స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ సెంటర్, తాలూకా ఆఫీస్ మీదుగా పోస్టాఫీస్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో బలరామ్, సుందరరామరాజు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక సంపద సృష్టికర్తలైన రైతు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కార్మికులకు మేలు చేసే చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలమైన లేబర్ కోడ్స్‌ను తెచ్చారన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి మాట్లాడుతూ... ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రామీణ పేదలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు జైల్‌భరోను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దండు శ్రీనివాసరాజు, గొర్ల రామకృష్ణ, డి. కళ్యాణి, ధనికొండ శ్రీనివాస్, కె. తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.


