చింతలపూడి: వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ ఏఎంసీ చైర్‌పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి(60)ఆకస్మికంగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం ఆదివారం ఉదయం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడుతుండగా, ఆమెకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కుటుంబసభ్యులు, అనుచరులు వెంటనే స్పందించి మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యలో ఏలూరు సమీపానికి చేరుకునేసరికి ఆమె పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. జానకిరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ బలోపేతానికి విశేష సేవలందించిన నాయకురాలిని కోల్పోవడం తీరని లోటని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్‌రెడ్డి, పట్టణ వైపీపీ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, ఎ.సుబ్బారావు తదితరులు జానకిరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు.
పాలకొల్లు సెంట్రల్: ధార్మిక సామాజిక పరిషత్ ఆధ్వర్యంలో సూర్యహోమం నిర్వహించారు. ఆదివారం స్థానిక హనుమాన్ కాలనీలో ఉన్న సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో 324వ సూర్యహోమం ఘనంగా చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సూర్యహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పురోహితుడు రవీంద్ర బ్రహ్మత్వంలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ ఈ హోమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ హోమంలో పి.సత్యనారాయణరాజు, నిర్వాహకులు గాదె బాబు, నంబూరి పుల్లయ్య, జగపతిరాజు, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.
మండవల్లి: కొల్లేరు వరద నీటిని, ఉప్పు నీటిని నియంత్రించే రెగ్యులేటర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌ఎస్ భాస్కరరావు పేర్కొన్నారు. ఆదివారం మాట్లాడుతూ కొల్లేరు సరస్సుకు తిరిగి గత వైభవం రావాలన్నా, పక్షుల, మత్స్యకారుల జీవనం సజావుగా సాగాలన్నా, మత్స్య సంపద సమృద్ధిగా పెరగాలన్నా రెగ్యులేటర్ నిర్మాణమే మార్గమని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరు సరస్సుకు భారీగా నీరు చేరుతుందని నీటిని నియంత్రించలేక పోవడంతో ఈ నీరంతా సముద్రంలో వృథాగా పోతుందన్నారు. నీరు ఎగతన్ని కొల్లేరులో కలవడంతో నీరు ఉప్పుమయమై భూములు చౌడుబారుతున్నాయని చెప్పారు.
బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏలో ఆదివారం జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని జెడ్పీటీసీ మొడియం రామతులసి తీవ్రంగా ఆరోపించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి జరిగే గిరిజన పండుగలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు తనకు ఆహ్వానం రాలేదని ఆరోపించారు. ఈ సంఘటనతో ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌ల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామతులసిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తెల్లం రమణ, మాజీ సర్పంచ్‌లు కూరం వెంకటేశ్వరరావు, బన్నే బుచ్చిరాజు, తెల్లం వెంకాయమ్మ, తెల్లం రాముడు, మాల్చి వెంకన్నబాబు, జోడే సత్యదుర్గాప్రసాద్, ఎంపీటీసీ గాలి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.


