చిట్టీల పేరుతో దగా | - | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో దగా

Aug 10 2026 12:40 AM | Updated on Aug 10 2026 12:40 AM

దొరకని ఆచూకీ

ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు

రూ.40 కోట్ల టోకరాపై ఏజెంట్లను నిలదీస్తున్న బాధితులు

తణుకు అర్బన్‌: శ్రీదుర్గా భవాని చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ పేరుతో రూ.40 కోట్లకు టోకరా వేసిన వ్యవహారం తణుకు నియోజకవర్గంలో సంచలనం రేకెత్తించగా, ఈ ఘటనకు సంబంధించి బాధితులు భారీ స్థాయిలో బయటకు వస్తున్నారు. గత 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తూ అందరినీ నమ్మించిన ఫైనాన్స్‌ వ్యాపారి గోలి శ్రీనివాసరావు మోసంతో పేదవర్గానికి చెందిన బాధితులు అల్లాడిపోతున్నారు. తణుకు ఇరగవరం కాలనీ అక్షయనగర్‌లో అధునాతన వసతులతో విలాసవంతంగా నిర్మించుకున్న నాలుగు అంతస్థుల భవనంలో నివసిస్తున్న గోలి శ్రీనివాసరావు చిట్టీల పేరుతో పేదవర్గాల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్న విషయం తెలిసిందే. ఆదివారం వివిధ ప్రసార సాధనాలు, పత్రికల్లో వచ్చిన వార్తలతో బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తణుకు కేంద్రంగా నిర్వహించిన ఈ దోపిడీలో ఇరగవరం మండలంలో అధిక శాతం బాధితులు ఉండగా, అత్తిలి, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో సైతం అనేకమంది మోసపోయారు. దీనిపై ఇప్పటికే ఇరగవరం పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. చిట్టీల వ్యవహారం బయటపడడంతో రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

తణుకు పోలీస్‌ స్టేషన్‌కు ఏజెంట్లు

గోలి శ్రీనివాసరావు చిట్టీల సంస్థలో పనిచేసిన ఏజెంట్లు తణుకు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. సంస్థను నమ్మి డబ్బు కట్టిన బాధితులు తమను నిలదీస్తూ ఒత్తిడి చేస్తున్నారంటూ పోలీసులను వేడుకున్నారు. తాము చిట్టీల సంస్థలో పనిచేశామని, బాధితుల నుంచి డబ్బులు తీసుకుని సంస్థకు చెల్లించామని వారు చెబుతున్నారు. ఈ సంస్థలో 20 మందికి పైగా ఏజెంట్లు పనిచేస్తున్నట్లు సమాచారం.

చిట్స్‌, ఫైనాన్స్‌ పేరుతో మోసానికి పాల్పడిన గోలి శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా దొరకలేదు. బాధితులంతా పేదవర్గానికి చెందినవారే అధికంగా ఉండడంతో వారి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసరావు, అతని కుటుంబసభ్యుల ఫోన్‌లు కూడా పనిచేయకపోవడంతో ఆచూకీ లభించడంలేదని బాధితులు వాపోతున్నారు. చిట్టీల శ్రీనివాసరావు వ్యవహారాన్ని పోలీసులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. మోసం భారీ స్థాయిలో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చిట్టీల వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉన్నారు, మొత్తం ఎంత అనే కోణంలో పోలీసులు ఇప్పటికే కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతోపాటు సంస్థలో పనిచేస్తున్న ఏజెంట్లను కూడా ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు బాధితులు వస్తుండడంతో అసలు మోసపోయిన మొత్తం రూ. 40 కోట్లేనా లేక మరింత ఎక్కువ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement