బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో గ్రావెల్ లోడుతో వెళ్తున్న లారీ బంగారు దుకాణంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. గ్రామస్తుల వివరాలు ప్రకారం ఆదివారం సాయంత్రం గ్రావెల్ లోడుతో లారీ అతివేగంగా విజయవాడ వెళుతుండగా నెక్కలం గొల్లగూడెం వద్దకు రాగానే ఎదురుగా కారును తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ షాపు దుకాణంలోకి దూసుకుపోయింది. అక్కడే ఉన్న వారు గమనించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రతిరోజు వందలాది గ్రావెల్ లారీలను మద్యం మత్తులో అతివేగంగా నడిపి ఆందోళనకు గురి చేస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


