వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన 74 ఏళ్ల కారం లక్ష్మయ్య.. జీవనాధారమైన వ్యవసాయ భూమిని అధికారులు అప్పగించకపోవడంతో ఆ దిగులుతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య కారం చిన్నక్కను కూడా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. కారం లక్ష్మయ్యకు వేలేరుపాడు మండలం తిర్లాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 57, 60లలో 4.33 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి బదులుగా 2017లో జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం రెవెన్యూ సర్వే నంబర్ 118/1సీలో 4.33 ఎకరాల భూమిని జల్లేరు వాగు ఒడ్డున కేటాయించారు. అయితే, వరద ప్రవాహానికి ఆ భూమంతా కొట్టుకుపోయి, కనీసం అరెకరం భూమి కూడా మిగల్లేదు. అప్పటి నుంచి మరోచోట సాగుకు యోగ్యమైన భూమి చూపించాలని లక్ష్మయ్య అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. పీఓలు మారినప్పుడల్లా వినతిపత్రాలు సమర్పించడం పరిపాటైంది. స్వర్ణవారిగూడెంలో మిగులు భూమిగా ఉన్న సర్వే నంబర్ 33/1లో 4.00 ఎకరాలు, సర్వే నంబర్ 33/2లో 0.62 ఎకరాలను రెండేళ్ల క్రితం మండల సర్వేయర్, వీఆర్వో, వీఆర్‌ఏ పరిశీలించి చూపించారు. కానీ, స్వర్ణవారిగూడెం వీఆర్వో, వీఆర్‌ఏ, స్థానిక ఓ పార్టీ నేత కుమ్మకై ్క ఈ భూములను కాజేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.


