బుట్టాయగూడెం: తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి మళ్లీ ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన పెద్దపులి బుట్టాయగూడెం మండలంలో భయాందోళనలు సృష్టిస్తోంది. శనివారం తెల్లవారుజామున గవరంపేట, గురుగుమిల్లి గ్రామాల శివారులో కట్టేసి ఉన్న రెండు ఎద్దులు, ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లంకపాకల సమీపంలోని కొండకాల్వ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రేపల్లె, రేగులపాడు, డోలుగండి, మోదేలు, అలివేరు, లంకపాకల, గుళ్లపూడి, వీరమద్దిగూడెం తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పశువులను ఇళ్ల వద్దే సురక్షితంగా కట్టేయాలని, రాత్రి వేళల్లో బయట తిరగవద్దని, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. డీఎఫ్‌ఓ సందీప్‌రెడ్డి, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారి దుర్గాకుమార్‌బాబు నేతృత్వంలో మహారాష్ట్ర బృందాలు, బెంగళూరు వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ నిపుణులు, ఆరుగురు ట్రాంక్విలైజింగ్ షూటర్లు రంగంలోకి దిగారు.
లంకపాకల సమీపంలో ప్రత్యేక బృందాలు
గురుగుమల్లిలో పెద్దపులి దాడిలో మృతి చెందిన ఎద్దు


