భీమవరం: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి సమాధానం చెప్పలేని ప్రభుత్వంపై జైల్‌భరో పేరుతో స్వచ్ఛంద అరెస్టులకు కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్ అన్నారు. ఈ నెల 10వ తేదీన క్విట్ కార్పొరేట్, క్విట్ నరేంద్ర మోదీ నినాదంతో జైలు భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రచారంలో భాగంగా శనివారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో బైక్ ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, విపరీతమైన ధరల పెరుగుదల, ఉపాధి కోతలు వంటి సమస్యలను దేశ ప్రజలపై మోపిందని విమర్శించారు. ఈ బైక్ యాత్రకు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అనంతరం బైక్ యాత్ర ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా తాడేరు, యమునాపల్లి, శృంగవృక్షం ప్రాంతాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు.


