సీబీఐ విచారణ జరగాలి
అక్రమాల పర్వం
భీమవరం (ప్రకాశంచౌక్): తొలి సంతకం అంటూ మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటంగా ప్రచారం చేసి టీచర్ల నియామకాల్లో అంతులేని అక్రమాలు చేశారని, డీఎస్సీ స్కామ్ సూత్రధారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చే యాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి డీఎస్సీ అవకతవకలపై నిరసన తెలియజేసి అనంతరం డీఆర్వో కె.ప్రభాకర్‌కు సీబీఐ విచారణ చేయించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రసాదరాజు మాట్లాడుతూ డీఎస్సీ–2025లో 16 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీ చేపట్టగా స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష లేకుండా క్రీడా ప్రతిభ, సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక చేశారన్నారు. అందుకోసం ప్రత్యేకంగా జీఓలు జారీ చేసి కనీసం డిగ్రీ, టెట్‌లో అర్హత లేకున్నా కేవలం శాప్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేయడం దారుణమన్నారు. అంతులేని అక్రమాలతో కూడిన ఈ డీఎస్సీ పరీక్షపై తమ పార్టీ స్పష్టంగా ఆధారాలు చూపించిందన్నారు. అయితే పొంతన లేని సమాధానాలతో ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు.
వాస్తవాలు ఒప్పుకోకుండా ప్రగల్భాలు
దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాల్లో ఒక్క అక్రమం జరిగినా అది మొత్తం విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ప్రసాదరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవకతవకలు జరగకపోతే సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు.
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాదీవెన, వసతిదీవెనల పథకాలకు పూర్తిగా మంగళం పాడిందని ముదునూరి ధ్వజమెత్తారు. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తంగా రూ.9,100 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. అలాగే వసతి దీవెన బకాయిలు రూ.3,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. అలాగే సూపర్‌సిక్స్‌లో భాగంగా యువతకు ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏడాదికి 4 లక్షలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల మాటేంటని, అప్పటివరకూ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగి భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిత్యం పో రాటం చేస్తూనే ఉంటుందన్నారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై రాజీలేని పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు చినమిల్లి వెంకటరాయుడు, వడ్డి రఘురాం, మంతెన యోగేంద్రకుమార్, ఎస్‌ఈసీ మెంబర్లు పాతపాటి శ్రీనివాసరాజు, పెండ్ర వీరన్న, సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్లమెంట్ సెక్రటరీలు వేండ్ర వెంకటస్వామి, ఏఎస్ రాజు, యడ్ల తాతాజీ, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు అరిగెల్ అభి షేక్,స్టేట్ స్టూడెంట్ సెక్రటరీ గంటా రాహుల్, పా ర్టీ పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు, గొర్రెల శ్రీ ను, అంబటి రమేష్, సీతారామయ్య, దుర్గా ప్ర సాద్, ఉండి జెడ్పీటీసీ రణస్థల మహాంకాళి, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణ పాల్గొన్నారు.
నిరుద్యోగులను మోసం చేస్తూ నిర్వహించిన 2025 డీఎస్సీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. డీఎస్సీలో పలు అవకతవకాలు జరిగాయని తమ పార్టీ నుంచి ఆధారాలు చూపుతున్నా ప్రభుత్వం డీఎస్సీ విచారణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
– ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు
డీఎస్సీ–2025 మొత్తం అక్రమాల పర్వంగా సాగింది. గత ప్రభుత్వంలో కన్వీనర్‌గా ఉన్న అధికారిని మార్చారు. ప్రశ్నాపత్రాల తయారీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వరకూ చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారు కాకుండా జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు.
– గూడూరి ఉమాబాల, నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త
డీఎస్సీలో అక్రమాలు
బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి
విద్యా, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి
వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం


