భీమవరం: సంబంధం లేని పనులు సైతం చే యించుకుంటూ స్కీమ్ వర్కర్లతో వెట్టి చేయికుంటున్న ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రభుత్వానికి తగిని గుణపాఠం చెబుతామంటూ స్కీమ్ వర్కర్లు గర్జించారు. తమ సమస్యలను చెప్పుకోడానికి కలెక్టరేట్‌కు వస్తే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకుండా ప్రభుత్వం కుట్ర చేసిందంటూ మండిపడ్డారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశ, ఐకేపీ, మిడ్‌డే మీల్స్ కార్మికులు భీమవరంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ముందుగా కలెక్టరేట్ సమీపంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లంటే ప్రభుత్వానికి బానిసలు కాదన్నారు. సంబంధం లేని పనులను స్కీమ్ వర్కర్ల అన్యాయంగా చేయించుకుంటున్నారని, సమస్యలు చెప్పేందుకు కలెక్టరేట్‌కు వస్తే ఉన్నతాధికారులు లేకపోవడం దారుణమని దుయ్యబట్టారు. శ్రామిక మహిళ నాయకురాలు డి.కళ్యాణి, అంగన్‌వాడీ నాయకురాలు ఎండీ హసీనా, ఆశ వర్కర్ల యూనియన్ నాయకురాలు సీహెచ్ లక్ష్మి, ఐకేపీ నాయకురాలు గో విందమ్మ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఊక దంపుడు ఉపన్యాసాలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకువచ్చారు. కలెక్టరేట్ గుటు వద్ద బైఠాయించారు. వీరి వద్దకు డీఆర్వో వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు పీవీ ప్రతాప్, ఎం.ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ, తెలగంశెట్టి సత్యనారాయణ, ఎస్. రంగారావు తదితరులు పాల్గొన్నారు.


