మరణంలోనూ వీడని రక్త బంధం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని రక్త బంధం

Aug 1 2026 1:13 AM | Updated on Aug 1 2026 1:13 AM

తండ్రి మరణ వార్త తెలిసి కుమార్తె మృతి

ఒకేరోజు తండ్రీ కూతుళ్ల మృతితో విషాదఛాయలు

తణుకు అర్బన్‌: పేగు బంధం అంటే ఇదేనేమో! ప్రాణంగా చూసుకున్న తండ్రి ఇక లేడన్న చేదు వార్త ఆ కుమార్తె గుండెను పిండేసింది. శస్త్రచికిత్స విజయవంతమైందన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరై, తండ్రి మరణ వార్త వినగానే ఆమె గుండె నిమిషాల్లోనే ఆగిపోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

తణుకు ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన సరెళ్ల ప్రిస్కిల్లా (65) వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసి, నాలుగేళ్ల క్రితం అత్తిలి మండలం మంచిలి పీహెచ్‌సీలో పదవీ విరమణ చేశారు. ఆమె తండ్రి, పాలకొల్లు నివాసి సరెళ్ల సుబ్బారావు (90) టెలిఫోన్‌ శాఖలో టీఎస్‌వోగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఇటీవల సుబ్బారావుకు హైదరాబాద్‌ లోని కిమ్స్‌ ఆస్పత్రిలో మోకాళ్ల శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం వేకువజామున శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు చెప్పడంతో ప్రిస్కిల్లా ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లారు. అయితే వయోభారం కారణంగా శరీరం సహకరించక కాసేపటికే సుబ్బారావు మృతిచెందారు. ఈ విషయాన్ని ఫోన్‌ ద్వారా తెలుసుకున్న ప్రిస్కిల్లా తీవ్ర దిగ్భ్రాంతికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను పరిశీలించిన వైద్యులు కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించినట్లు నిర్ధారించారు. గతంలోనే సుబ్బారావు భార్య, ప్రిస్కిల్లా భర్త (ఉపాధ్యాయుడు) మరణించారు. సుబ్బారావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా.. ప్రిస్కిల్లాకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఒకే రోజు తండ్రీకూతుళ్లు ఇద్దరూ అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. హైదరాబాద్‌ నుంచి మృతదేహాలను తీసుకొచ్చి, సుబ్బారావు భౌతికకాయానికి పాలకొల్లులోనూ, ప్రిస్కిల్లా భౌతికకాయానికి తణుకులోనూ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనతో తణుకు, పాలకొల్లు ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement