కుక్కునూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదికి క్రమంగా నీటి ప్రవాహం పెరిగి కుక్కునూరు మండల పరిధిలో నిండుకుండలా కనిపిస్తూ పరవళ్లు తొక్కుతోంది. గురువారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతున్న గోదావరి సాయంత్రం 6 గంటల సమయంలో భద్రాచలం వద్ద 26 అడుగులకు చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక ప్రజలు నదిలో చేపలు పట్టడం, స్నానాలు చేయడం వంటి పనులు చేయరాదాని హెచ్చరించారు.
పట్టిసీమ వద్ద ఉధృతంగా..
పోలవరం రూరల్: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమీట్టం 29 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 2.14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.


