ఉద్రిక్తతగా కలెక్టరేట్‌ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతగా కలెక్టరేట్‌ ముట్టడి

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

ఉద్రిక్తతగా కలెక్టరేట్‌ ముట్టడి

భీమవరం: సమస్యల పరిష్కారం కోరుతూ షెడ్యూల్డ్‌ పరిశ్రమల కార్మికులు చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరిన కార్మికులను అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. దీంతో కొందరు కార్మికులు, పోలీసులు సైతం కింద పడిపోయారు.

కనీస సౌకర్యాలు కల్పించాలి

కలెక్టరేట్‌కు దగ్గరలోని ప్రైవేట్‌ విద్యాసంస్థ వద్ద రోడ్డుపై సీఐటీయూ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్‌ పరిశ్రమల కార్మికులు గురువారం ఆందోళన చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సదుపాయం కల్పించాలని, కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదనపు డ్యూటీలు రద్దు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి పీవీ ప్రతాప్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ షెడ్యూల్‌ పరిశ్రమల్లో లక్షలాది మంది కనీస సౌకర్యాలు, వేతనాలు లేకుండా పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ కార్మికులను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా మాటలు చెప్పడం తప్ప చట్టప్రకారం వారికి ఇవ్వాల్సిన వేతనాలు, సౌకర్యాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. అధికారులకు సమస్యలు చెప్పుకుందామని వస్తే నిలబడ్డానికి కూడా చోటు లేదని ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌ మాట్లాడుతూ కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి సీపీఎం మద్దతుగా ఉంటుందన్నారు. కోట్లాది రూపాయల విలువచేసే భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కుని బడా బాబులకు కేవలం 99 పైసలకే ఇస్తానంటున్న ప్రభుత్వం షెడ్యూలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను గుర్తించకపోవడం దారుణమన్నారు.

తోపులాట

కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లే ఉద్యోగులు, ప్రజలకు దారి లేకపోవడంతో అడ్డు తొలగాలని పోలీసులు కార్మికులను హెచ్చరించారు. అయినా పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా కార్మికులు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. కలెక్టరేట్‌ గేటు వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. కార్మికులు, సీఐటీయూ, సీపీఎం నాయకులు బారికేడ్లు, రోప్‌ అడ్డంకిని దాటుకుని ముందుకు రావడంతో తోపులాట జరిగింది. పోలీసు ఆంక్షలను తోసిరాజని కలెక్టరేట్‌ గేట్‌ వద్ద కూర్చుని ముట్టడి చేశారు. కలెక్టర్‌ స్వయంగా వచ్చి సమస్యలు వినాలని పట్టుబట్టారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ ఆందోళనకారుల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, ఎస్‌.రంగారావు, డి.కళ్యాణి, ఎస్‌.వెంకటేశ్వరరావు, గొర్ల రామకృష్ణ, ఎం.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోరుతూ షెడ్యూల్డ్‌ పరిశ్రమ కార్మికుల ఆందోళన

కలెక్టరేట్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement