వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు ఆడిట్‌లో పారదర్శకతకు ప్రాధాన్యతమివ్వాలి బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల మెరిట్‌ జాబితా భైరాగిమఠం భూముల సాగుపై స్టే

భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గానికి చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మైనార్టీ సెల్‌ సెక్రటరీగా మహ్మద్‌ కరీముల్లా, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా అల్లూరి రవిరాజు నియమితులయ్యారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఆడిట్‌ నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌ నందు కలెక్టర్‌ చదలవాడ నాగరాణిను స్టేట్‌ ఆడిట్‌ విభాగం (జోన్‌–2, ఏలూరు) రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బీఆర్‌ క్రాంతి కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల ఆర్థిక వ్యవహారాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కృషి

ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. వెట్టిచాకిరీని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

నూతన పరిశ్రమలు రావాలి

నూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాల మంజూరులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం, ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ సింగిల్‌ విండో పోర్టల్‌ ద్వారా అనుమతుల కోసం వచ్చిన 19 దరఖాస్తుల్లో 14 దరఖాస్తులు ఆమోదించగా మిగిలిన 5 పరిష్కార దశలో ఉన్నాయన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు, రిజెక్టెడ్‌ జాబితాలను ఏలూరు జిల్లా వెబ్‌సైట్‌, ఏలూరులోని విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచినట్లు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆధారాలు సమర్పించాలన్నారు.

ఉంగుటూరు: పెంటపాడు భైరాగిమఠానికి చెందిన 84 ఎకరాల భూముల వ్యవహారంలో ఎండోమెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు రావులపర్రు రైతులకు అనుకూలంగా స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఆ రైతులు ఈ వివరాలను వెల్లడించారు. దొంతవరానికి చెందిన పాత రైతులే కౌలు పెంచుకుని భూములు సాగు చేసుకునేలా ఎండోమెంట్‌ కమిషనర్‌ గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే ధర్మరాజు, దొంతవరం రైతులకు 20 శాతం కౌలు పెంచి పాత రైతులకే సాగు చేసుకునేందుకు అనుమతినిచ్చారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రావులపర్రు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

జేఎన్‌టీయూకే పాలకమండలి రద్దు

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కాలపరిమితి నెల రోజులు ఉండగానే జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ పాలక మండలిని రద్దుచేస్తూ ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త పాలక మండలి సభ్యులను నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పాలకమండలి సభ్యులను నిర్వీర్యం చేసి వారితో ఏవిధమైన సమావేశాలూ నిర్వహించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement