జాగ్రత్తలు తీసుకోవాలి
● ఎల్‌నినోతో ఎండిన కొబ్బరితోటలు
● పడిపోయిన కొబ్బరి దిగుబడులు
● రైతుల్లో ఆందోళన
భీమవరం: వర్షాభావం, వడగాల్పుల ప్రభావంతో జిల్లాలో కొబ్బరి దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన ఈ జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్న కొబ్బరి పంటకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో కొబ్బరి తోటలతో పాటు పెరటి దొడ్లు, పుంత గట్లు, రోడ్ల వెంబడి ఈ సాగు విస్తరించి ఉంది. సాధారణంగా వేసవిలో నీటి కొరత కారణంగా చెట్లు పసుపు రంగులోకి మారి మోడువారడం సహజమే అయినప్పటికీ, ప్రస్తుత వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగడం గమనార్హం. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. సాధారణంగా జూన్, జూలై నెలల్లో సరాసరి 147.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈ ఏడాది కేవలం 66.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. వర్షాలు లేకపోవడం, తీవ్రమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి, చెట్లకు సరిపడా నీరు అందక తోటలు దెబ్బతింటున్నాయి.
25 వేల ఎకరాల్లో సాగు
జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉండగా, ముఖ్యంగా యలమంచిలి, పెనుగొండ, పోడూరు, వీరవాసరం, పాలకొల్లు, పాలకోడేరు తదితర మండలాల్లో ఈ సాగు ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో ఆక్వా చెరువుల విస్తరణ పెరగడంతో చెరువు గట్లపై కూడా పెద్ద ఎత్తున కొబ్బరి పెంచుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో 60 చెట్లు ఉండాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా కొందరు రైతులు 90 చెట్ల వరకు సాగు చేస్తున్నారు. గతంలో కొబ్బరి పెంపకానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండేది కాదు. కానీ, కొన్నేళ్లుగా నల్లమట్టి పురుగు, తెల్లదోమ వంటి తెగుళ్లు ఆశించడంతో తోటల యాజమాన్యం భారంగా మారింది. ఎరువులు, పురుగుమందుల వాడకం విపరీతంగా పెరగడంతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
ధర పెరిగినా ప్రయోజనం శూన్యం
దిగుబడి భారీగా పడిపోవడంతో కొబ్బరి ధరలు పెరిగినప్పటికీ, రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. మే, జూన్ నెలల్లో వెయ్యి కొబ్బరి కాయల ధర కేవలం రూ.13 వేలు మాత్రమే పలకగా.. ప్రస్తుతం ఎగుమతులకు కాయలు సరిపడా లభించకపోవడంతో వ్యాపారులు రూ.18 వేలు పైబడి కొనుగోలు చేస్తున్నారు. అయితే, తోటల్లో దిగుబడి నామమాత్రంగా ఉండటంతో కాయల దింపు, వలుపు కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నుంచి తోటలను కాపాడుకోవడానికి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల మొదళ్ల వద్ద చిన్నచిన్న గుంటలు తీయడం వల్ల కొద్దిపాటి వర్షం కురిసినా నీరు ఇంకి చెట్లకు చేరుతుంది. అలాగే తోటల్లో బోదెలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఎద్దడి నుంచి రక్షణ కల్పించవచ్చు. రైతులు కేవలం ముడి కాయల ఎగుమతులపైనే ఆధారపడకుండా, మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందడానికి కొబ్బరి ఆధారిత అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి.
– ఎం.హరిప్రసాద్,
జిల్లా ఉద్యానశాఖాధికారి, భీమవరం


