దెందులూరు: రాజకీయాలు హుందాగా చేయాలే తప్ప, పదిమంది వేలెత్తి చూపించేలా ఉండకూడదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. గురువారం ఏలూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆయనను కలిశారు. చల్ల చింతలపూడి గ్రామంలో బుధవారం రాత్రి బస్టాండ్ సెంటర్ వద్ద పార్టీ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేసి, తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపైనే దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టించారని అబ్బయ్య చౌదరికి నాని వివరించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా లేనివిధంగా ఈ తరహా కక్షసాధింపు రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఫ్లెక్సీలు చించి, మా నాయకులపైనే కేసులు పెడతారా? ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేముంటుంది?’ అని మండిపడ్డారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ధైర్యంగా పోరాడాలని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని చల్ల చింతలపూడి పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ కుమార్, చల్ల చింతలపూడి గ్రామ పార్టీ అధ్యక్షుడు వేమన నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం


