ప్రతిభతో మెరిసి.. అవార్డుతోమురిసి.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిభతో మెరిసి.. అవార్డుతోమురిసి..

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

ఉత్తమ విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు జిల్లాలో 163 మందికి అందజేత

భీమవరం: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్‌ స్టార్‌ అవార్డులను అందజేశారు. స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సోమ వారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. విద్యార్థులు విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయలను అలవర్చుకోవాలన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ సమాజాభివృద్ధికి విద్యే మూలాధారమన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. అనంతరం 127 మంది టెన్త్‌, 36 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు, రూ.20 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. డీఈఓ ఈ.నారాయణ, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌ పీతల సుజాత, మత్స్యకార సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కొల్లి పెద్దిరాజు, ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పి.మురళీమోహన్‌, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి బి.అప్పారావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ పి.శ్యాంసుందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ప్రజాప్రతినిధుల గైర్హాజరు

షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు ప్రధానోత్సవానికి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణంరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్‌లు బొలిశెట్టి శ్రీనివాస్‌, బొమ్మిడి నాయకర్‌, ఆచంట, ఉంగుటూరు ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, పత్సమట్ల ధర్మరాజుతో సహా పలువురు ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడంతో వేదిక వెలవెలబోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement