చేపనారు ఉత్పత్తి ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

చేపనారు ఉత్పత్తి ప్రారంభం

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

సిబ్బంది కొరత ఉంది

ఉంగుటూరు: బాదంపూడి మత్స్య కేంద్రంలో చేపనారు ఉత్పత్తి ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణంగా చేపనారు ఉత్పత్తికి వాతావరణ ఉష్ణోగ్రత 28 డిగ్రీల లోపు ఉండాలి. ఈ ఏడాది 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉత్పత్తి ఆలస్యమైంది. ఏటా జూన్‌ నెలలో గోదావరి కాలువలకు నీరు రాగానే ఉత్పత్తిని ప్రారంభిస్తారు, ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. గతంలో ఇక్కడ ఉత్పత్తి చేసిన చేపనారును బయట ఫారాలకు విక్రయించేవారు. సంస్థ స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎదిగింది. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావడంతో ప్రస్తుతం ఉత్పత్తి చేసిన చేప పిల్లలను కేవలం ప్రభుత్వ ఫారాలకు, రిజర్వాయర్లలో ఉచితంగా వదిలేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

అన్నీ సమస్యలే..

ఈ కేంద్రం సమర్థవంతంగా పనిచేయాలంటే కనీసం 20 మంది సిబ్బంది అవసరం, కానీ ప్రస్తుతం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్లు కూడా ఇన్‌చార్జులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్రం వద్ద సరైన పర్యవేక్షణ, రక్షణ వసతులు లేవు. కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడంతో బయట వ్యక్తులు ఫారంలోకి చొరబడి చేపలను అపహరించే ప్రమాదం పొంచి ఉంది. ఉత్పత్తికి అధిక వ్యయం అవుతున్నప్పటికీ, ఆదాయం లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఫారంను ఎలా నడపాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది.

మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, అంతరించిపోతున్న చేప జాతులను కాపాడేందుకు మత్స్యశాఖ ఈ కేంద్రంలో చేపనారు ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన చేప పిల్లలను పోలవరం, కృష్ణా, గోదావరి నదులతో పాటు పోగుండ, కొంగువారి ప్రాజెక్టు, జల్లేరు జలాశయం, కొన్ని మేజర్‌ ఇరిగేషన్‌ చెరువుల్లో వదలాలని నిర్ణయించారు. చైనీస్‌ హేచరీని ఉపయోగించి ప్రస్తుతం చేపనారు ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 65 లక్షల చేపనారును ఉత్పత్తి చేయగా, అందులో 35 లక్షలను బాదంపూడి కుండీల్లో, 25 లక్షలను ఏలూరు ప్రభుత్వ ఫారంలో స్టాక్‌ చేశారు.

వాతావరణం అనుకూలించక

ఆలస్యంగా ప్రక్రియ

బాదంపూడి చేపల కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించాం. సిబ్బంది కొరత వంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తున్నాం. గతంలో ఇన్‌చార్జులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఏడీఏని, ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టరును నియమించాం. ఇకపై ఫారం నిర్వహణ మెరుగుపడుతుంది.

–ఆర్‌.వి. ప్రసాద్‌ , జిల్లా ఫిషరీస్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement