జీఓ 396 రద్దు చేయాలి
ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు
● నేటి నుంచి పెన్‌డౌన్
● పీపీపీని రద్దు చేయాలంటూ డిమాండ్
భీమవరం : భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజా, ప్రైవేట్ భాగ స్వామ్య (పీపీపీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు సరికొత్త నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20వ తేదీ (సోమవారం) నుంచి జిల్లావ్యాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఉపాధిపై ముంచుకొస్తున్న ముప్పు
జిల్లాలోని 27 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆధారపడి సుమారు 3 వేల మంది దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సహాయకుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. భూ ముల క్రయవిక్రయాల్లో ఇరుపక్షాలకు మధ్యవర్తులుగా ఉంటూ, రిజిస్ట్రేషన్ పనులను వీరు సజా వుగా పూర్తి చేస్తుంటారు. అక్కడక్కడా కొందరు లేఖర్లు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నా అత్యధిక శాతం మంది ప్రజలకు నమ్మకంగా సేవలు అందిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకురావడం వల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని లేఖర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లేఖర్ల ప్రధాన వాదనలు, ఆందోళనలు
● ఆస్తులకు రక్షణ కరవు : నూతన జీఓ వల్ల ప్రజల ఆస్తి వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల ఆస్తులకు భద్రత ఉండదని లేఖర్లు వివరిస్తున్నారు.
● ప్రభుత్వానికి భారం కాదు : దస్తావేజు లేఖర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, వీరికి ప్రభుత్వం ఎలాంటి స్టయిఫండ్ లేదా జీతాలు ఇవ్వడం లేదని గుర్తుచేస్తున్నారు.
● ఉధృతం కానున్న నిరసనలు : ఈ సమస్యపై ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో.. ఇప్పటికే రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దీక్షలు, వంటా వార్పు, ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఇప్పుడు తీవ్ర నిరసనగా పెన్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలకు తప్పని ఇబ్బందులు
దస్తావేజు లేఖర్లు సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తుండటంతో భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకునే సామాన్య ప్రజల కు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.
భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వ నూతన విధానాన్ని నిరసిస్తున్నాం. పీపీపీ విధానం వల్ల జిల్లాలో సుమారు 3 వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముంది. జీఓ 396ను రద్దు కోసం ఇప్పటికే పలు రకాలుగా నిరసనలు తెలిపాం. మాగోడును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సో మవారం నుంచి పెన్‌డౌన్ చేపట్టనున్నాం.
– తాళ్లూరి మధు, జనరల్ సెక్రటరీ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్
దాదాపు 150 ఏళ్ల నుంచి అమలులో ఉన్న దస్తావేజు లేఖరి వ్యవస్థను ప్రభుత్వం నిర్వర్యం చేస్తోంది. పీపీపీ విధానం వల్ల ప్రజల ఆస్తులు ప్రైవేట్ పరం అవుతాయి. లేఖర్లు చేసే దస్తావేజులు న్యాయపరమైన అంశాలు క్రోడికరించి తయారుచేస్తాం. ప్రభుత్వ నూతన విధానం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకపోగా, దస్తావేజు లేఖర్లు ఉపాధిని కోల్పోతారు.
– కవురు పృధ్వీశంకర్, జనరల్ సెక్రటరీ, దస్తావేజు లేఖర్ల అసోసియేషన్, భీమవరం


