భీమవరం: క్రీడాకారులు ఏదో ఒక క్రీడలో మంచి ప్రావీణ్యాన్ని పెంపొందించుకుంటే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కమ్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులకు గతంలో మానసిక ఒత్తిడులు ఉండేవి కావని, చక్కగా చదువుకొని ఏదో ఒక ఆటతో సేదతీరే వారన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఒత్తిడిని జయించాలంటే కష్టపడి చదవడమేగాక క్రమశిక్షణ, ఆటల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ.. తమ కళాశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం. వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 460 మంది క్రీడాకారులు సెలక్షన్స్‌కు హాజరు కావడం విశేషమన్నారు. కార్యక్రమంలో కళాశాల క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్. హరిమోహన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఆర్ ప్రసాద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిట్టూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇందుకూరి కిషోర్, కళాశాల డైరెక్టర్ ఎం. జగపతిరాజు, ప్రిన్సిపల్ కె.వి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్. దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


