ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మన రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి నాశనం చేసే అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దంటూ ఈనెల 22న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కారం రాఘవ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు మాట్లాడారు. ఈ నెల 22న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో సంయుక్త కిసాన్ మోర్చాలోని భాగస్వామ్య సంఘాలతో పాటు జిల్లాలోని అన్ని పంటల రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


