పాలకోడేరు : మండలంలోని గొల్లలకోడేరు వంతెన సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం లారీ ప్రధాన రహదారిపై బోల్తా పడింది. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనప్పటికీ, అతను అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు.
బుట్టాయగూడెం: మండలంలోని ముప్పినవారిగూడెం సమీపంలో ఉన్న కడియలమ్మ అమ్మవారి గుడిలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గుడిలో ఉన్న డిబ్బీని దొంగిలించి ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్కూరుగమ్ము బైపాస్ రోడ్డు వద్ద పడేశారు. హుండీ చోరీ అయ్యిందని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. ప్రతి ఉగాదికి హుండీని ఏర్పాటు చేసి, మళ్లీ ఉగాదికి సొమ్మును లెక్కిస్తామని చెప్పారు. హుండీలో సుమారు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకూ ఉండే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు.


