యూరియా కోసం తప్పని పాట్లు
పెనుగొండ: యూరియా సమృద్ధిగా ఉందంటూ వ్యవసాయాధికారులు, జిల్లా స్థాయి అధికారులు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో యూరియా కోసం రైతన్నలకు పాట్లు తప్పడం లేదు. సొసైటీల్లో యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోవాలని మెలిక పెడుతుండడంతో సార్వాలో నష్టపోయిన రైతన్నలు అదనపు భారం భరించలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి సోమవారం ఆచంటలోని మృత్యుంజయ సొసైటీ వద్ద నెలకొంది. తొలుత యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోలంటూ మెలికపెట్టడంతో ఉదయం సొసైటీ వద్ద గందరగోళం నెలకొంది. యూరియా మాత్రమే ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టి కొద్దిసేపు వాగ్విదానానికి దిగారు. దీంతో ఉన్నతాధికారులు కలగజేసుకొని సమస్యను సర్దుబాటు చేసి, యూరియాపై నియంత్రణ విధించారు. పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కోటాగా సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కేటాయించిన మేర యూరియా తీసుకువెళ్లడానికి రైతులు గంటలు తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కాగా కొందరు కూటమి నాయకులు యూరియా అందరికీ అందనివ్వకుండా అడ్డుకొంటున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు అందించాల్సిన యూరియాలోనూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.


