స్మార్ట్ మీటర్లతో మీటర్ రీడర్ల ఉపాధికి ప్రమాదం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్మార్ట్ మీటర్లు బిగించడంతో మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీటర్ రీడర్ల సమావేశం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో గౌరవాధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. వక్తలు మాట్లాడుతూ విద్యుత్ సంస్థను నమ్ముకుని మీటర్ రీడర్లు 20 సంవత్సరాలు పైబడి బిల్లింగ్ చేస్తూ కుటుంబాలు పోషించుకుంటారని, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో జిల్లాలోని 356 మంది మీటర్ రీడర్లు పని లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తమను ఆదుకోవాలని గత రెండేళ్లుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై రానున్న రోజుల్లో మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో వైజాగ్, విజయవాడలో జరిగే కార్యాచరణ రూపొందిస్తారని, మీటర్ రీడర్లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.దుర్గారావు, మల్లేశ్వరరావు, ఆశోక్, ప్రకాష్, శశిధర్, వెంకటరత్నం, మహేష్, శ్రీను, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.


