
పంట కాలువ ప్రక్షాళన
ఉండి: ఈ నెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఇదేనా పంటకాలువల ప్రక్షాళన అనే కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం ఉండి పాములపర్రు పంటకాలువలో చెత్త, తూడును తొలగించి కాలువను ప్రక్షాళన చేశారు. దీంతో పాములపర్రు గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
భీమవరం: జిల్లాలో గీత కార్మికులకు కేటాయించాల్సిన బార్లను ప్రకటించామని జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగ ప్రభుకుమార్ తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల్లో శెట్టిబలిజ సామాజిక వర్గానికి, పాలకొల్లులో గౌడ సామాజిక వర్గానికి కేటాయించామని చెప్పారు.
భీమవరం (ప్రకాశంచౌక్): గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సమయం ఓటింగ్ కొనసాగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఎక్కువ సమయం పోలింగ్ నిర్వహించాల్సి వచ్చిందని, ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలింగ్ ఎక్కువ సమయం జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, ఎక్కువ సమయం పట్టడానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు, అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
ఉండి: శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో విద్యుత్ వినియోగదారుల సమస్యకు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ బొక్కా సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేయవచ్చని ఏఈ తెలిపారు.
యలమంచిలి: వరుసగా రెండో రోజు కూడా కనకాయలంక కాజ్‌వే వరద నీటిలో మునిగింది. ధవళేశ్వరం వద్ద బుధవారం సాయంత్రం 8.08 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రభావానికి గురైన కనకాయలంకలో తహసీల్దార్ నాగ వెంకట పవన్‌కుమార్, ఇతర అధికారులు పర్యటించారు. తహసీల్దార్ మాట్లాడుతూ భద్రాచలం వద్ద నీటిమట్టం గురువారం 48 అడుగులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. వరద పెరిగితే కనకాయలంక కాజ్‌వేతోపాటు పెదలంక కాజ్‌వే కూడా వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉందన్నారు. వరద పెరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో లంక గ్రామాలలో ప్రత్యేక అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు, మంచంపై చికిత్స పొందుతున్న రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.
ఏలూరు (టూటౌన్): కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖాధికారి ఎస్.ఎస్.కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.