
టీడీపీలో ‘నామినేటెడ్’ ముసలం
సాక్షి, భీమవరం: భీమవరంలో టీడీపీలో నామినేటెడ్ ముసలం రాజుకుంది. నామినేటెడ్ పదవుల్లో ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మి తమను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని నియోజకవర్గంలోని ఆ పార్టీకి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం నేతలు మండిపడుతున్నారు. తమ పట్ల వివక్ష చూపుతున్న నాయకత్వంపై తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. టీడీపీ భీమవరం నియోజకవర్గ గౌడ, శెట్టిబలిజ సంఘ సమావేశం బుధవారం స్థానిక సర్ధార్ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలులో జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవల్లి చంద్రశేఖర్, రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిక కమిటీ డైరెక్టర్ బొక్కా సూర్యనారాయణ, గౌడ సాధికారిక డైరెక్టర్ జంపన ధనరాజు, జిల్లా సాధికారిక కమిటీ కార్యదర్శి వీరమల్లు శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నేత కడలి మృత్యుంజయుడు తదితరులు మాట్లాడారు. బీసీల్లో అత్యధిక జనాభాగా ఉన్నా గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గాలకు దేవస్థానం బోర్డు, సొసైటీలు, నీటిసంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ నియామకాల్లో ఎక్కడా ప్రాధాన్యత కల్పించకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు బీసీల పార్టీకి చెబుతూ పదవులు మాత్రం ఇతర సామాజిక వర్గాల వారికి పంచుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతారామలక్ష్మి వద్ద తమ అసంతృప్తిని వెళ్లగక్కినా ఫలితం లేదన్నారు. కూటమి పేరు చెప్పి తమను బుజ్జిగిస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదన్నారు. బిస్కెట్ పడేస్తే సరిపోతుందన్న ధోరణీలో స్థానిక నాయకత్వం తీరుందని వారు మండిపడ్డారు. పార్టీ కోసం శ్రమిస్తే తమ పట్ల వివక్ష చూపుతూ గుర్తింపులేకుండా చేస్తున్నారన్నారు. తమ సామాజికవర్గాల పట్ల చిన్నచూపు చూస్తున్న నాయకత్వంపై తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని, సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. మరోమారు సమావేశం ఏర్పాటుచేసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు.
భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నేతల అసంతృప్తి
దేవస్థానం, సొసైటీ, ఏఎంసీ, నీటి సంఘాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం