
పకడ్బందీగా వినాయక చవితి ఉత్సవాలు
భీమవరం (ప్రకాశంచౌక్): వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిషేధించాలని, అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వినాయక చవిత ఉత్సావాలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సింగిల్ విండో విధానంలో ఫైర్, విద్యుత్, పోలీస్, మున్సిపల్ తదితర అధికారులు ఒకే వేదికలో కూర్చునేలా ఏర్పాటుకు పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా చూడాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు రెండు మూడు రోజుల ముందే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, కౌసర్ భానో పాల్గొన్నారు.