
ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఏలూరు, పశ్చిమ జిల్లాల్లో 91 డిగ్రీ కళాశాలలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీ ప్రవేశాల విషయంలో తాత్సారం చేసి వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాలపై సరైన నిర్ణయం తీసుకులేకపోవడంతో విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నారు. విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైతే సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంటుందని, ఆ ప్రభావం డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తయ్యేవరకూ ఉంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడిన నెలలోపే డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. అయితే కూటమి ప్రభుత్వం యువత భవితపై, విద్యారంగంపై చిన్నచూపుతో, ఇంజనీరింగ్, తదితర డిగ్రీ తత్సమాన కోర్సులను నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలకు మేలు చేకూర్చే విధానాలు అనుసరించి డిగ్రీ ప్రవేశాలను ఆలస్యం చేసింది.
నాలుగు నెలల తరువాత షెడ్యూల్ విడుదల
2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రభుత్వం గత ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసింది. ఆ ఫలితాల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల ఫలితాలను కూడా జూన్ 7వ తేదీన విడుదల చేసేసింది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలై నాలుగు నెలలు దాటిపోగా, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలై కూడా 75 రోజులు దాటిపోయింది. గతేడాది కూడా ప్రభుత్వం ఇలానే డిగ్రీ ప్రవేశాలను ఇంటర్ ఫలితాలు విడుదలైన రెండున్నర నెలల తరువాత చేపట్టగా అప్పట్లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైనందున విధానాలు రూపొందించడంలో ఆలస్యమై ఉంటుందని సరిపెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది కూడా డిగ్రీ ప్రవేశాలను మరింత ఆలస్యంగా అంటే నాలుగు నెలల తరువాత చేపట్టడం కూటమి ప్రభుత్వం వైఫల్యమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రవేశాల షెడ్యూల్ ఇలా..
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషనన్ అండ్ సోషల్ వర్క్, ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 25 నుంచి 28వ తేదీ వరకూ కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు, 29వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఈనెల 31న తుది సీట్ల కేటాయింపు పూర్తిచేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 91 డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏలూరు జిల్లాలో 7 ప్రభుత్వ, 1 ప్రభుత్వ ఎయిడెడ్ అటానమస్, ఒక ప్రైవేట్ అటానమస్, 31 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు మొత్తం కలిపి 40 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ప్రభుత్వ, 2 ప్రభుత్వ అటానమస్, 4 ఎయిడెడ్ అటానమస్, ఒక ప్రైవేట్ అటానమస్ కళాశాలున్నాయి. అలాగే ఒక ప్రైవేట్ ఎయిడెడ్, 39 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు మొత్తం కలిపి 51 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో మొత్తం వివిధ గ్రూపులకు సంబంధించిన సుమారు 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు నెలల తరువాత ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
సిలబస్ పూర్తికాకుండానే పరీక్షలు ఎదుర్కోవాలని విద్యార్థుల ఆందోళన