
కో–ఆపరేటివ్ బ్యాంకుల సేవలు విస్తృతం చేయాలి
తణుకు అర్బన్: కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా కోఆపరేటివ్ బ్యాంకుల సేవలు మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు తణుకు శాఖను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోఆపరేటివ్ బ్యాంకులు మెరుగైన సేవలు అందిస్తున్నాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు సహకరించాలని కోరారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ బ్రాంచి ప్రారంభోత్సవం పురస్కరించుకుని మూడురోజులపాటు అన్ని డిపాజిట్లపైనా ప్రత్యేక అదనపు వడ్డీ ఆఫర్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ముక్కామల మహా పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల బాబు, వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, రాజమండ్రి ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, సీఈవో ఎం.అచ్యుతరావు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభం మొదలుకానున్న తరుణంలో డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఉద్యోగాల పేరుతో మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామక పరీక్షల ఫలితాలు విడుదల కావటంతో అభ్యర్థులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు, ఇతర మోసగాళ్లు రంగంలోకి దిగారనీ, వారి మాయమాటలను ఎవరూ నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు. కొందరు నేరగాళ్లు అభ్యర్థులకు ఫోన్ చేసి మార్కుల్లో మార్పులు చేసి మీకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామంటూ నమ్మించి, భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుందనీ., ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అటువంటి వారి మాటలను నమ్మవద్దని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక ఎంపికలో ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తారని స్పష్టం చేశారు. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. అభ్యర్థులు మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు.