
చివరి దశకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం
సర్వీసు రోడ్లు అభివృద్ధి చేయాలి
చింతలపూడి: జిల్లాలో ఖమ్మం, దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. భూములు ఇచ్చిన రైతులకు సర్వీసు రోడ్లు నిర్మించి అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్– విశాఖ మధ్య దూరం తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్– విశాఖపట్నం మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గడమేకాక ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. 162 కిలోమీటర్ల నిడివి గల ఈ రహదారిలో 8 నుండి 10 ఇంటర్‌చేంజ్ పాయింట్లు ఉంటాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కార్లు, 100 కిలోమీటర్ల వేగంతో భారీ వాహనాలు ప్రయాణించేలా హైవే నిర్మాణం చేపడుతున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కడీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు రెండు ఫేజ్‌లలో చేపట్టనున్న ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 2023లో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ రహదారిని వర్గీకరించారు. జిల్లాలో రెండు దశల్లో నిర్మాణం చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పూణేకు చెందిన బెకం ఇన్‌ఫ్రా సంస్ధ చేపట్టింది. ఖమ్మం జిల్లా కృష్ణాపురం, తుంబూరు వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఈ జాతీయ రహదారి ప్రవేశిస్తుంది. చింతలపూడి మండలం, రేచర్ల గ్రామం నుంచి గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి 569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు 711.94 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మెట్ట ప్రాంతంలో నేషనల్ హైవే అందుబాటులోకి రానుండడంతో రవాణా సదుపాయాలు మెరుగయ్యే అవకాశం ఉంది. రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతుంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 1,297 ఎకరాలు సేకరించారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,609 కోట్ల అంచనాలతో మొత్తం ఆంధ్ర, తెలంగాణాలో కలిపి 5 దశల్లో రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు.
సర్వీసు రోడ్ల హామీ నెరవేర్చాలి: రైతులు
అయితే తమ వద్ద భూములు సేకరించే సమయంలో అధికారులు పంట పొలాల్లోకి వెళ్ళడానికి సర్వీసు రోడ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా రహదారి నిర్మాణం పూర్తి కావస్తున్నా సర్వీసు రోడ్లు అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్నారు. చింతలపూడి మండలంలో రేచర్ల, జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద తప్ప ఎక్కడా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎక్కే ఎంట్రీ పాయింట్ లేదు. దీంతో రైతులు, చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను సరుకులను అటు రాజమండ్రి, ఇటు విశాఖ, ఖమ్మం, హైద్రాబాద్ మార్కెట్లకు తీసుకుపోవాలంటే రేచర్ల , జంగారెడ్డిగూడెం లేదా ఖమ్మం జిల్లా వేంసూరు వద్ద తప్ప ఎక్కడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డెక్కే వీలే లేదు. అండర్‌పాస్ బ్రిడ్జ్‌లు కూడ ఎత్తు తగ్గించి నిర్మించడంతో పామాయిల్ గెలల లోడ్ ట్రాక్టర్‌లు, లారీలు , బోర్‌వెల్స్ లారీలు వెళ్ళ డానికి అవకాశం లేదు. కనీసం అండర్ పాస్ బ్రిడ్జిల ఎత్తు పెంచి నిర్మించినా రైతులకు కొంత మేర ఉపయోగంగా ఉండేది.
జిల్లాలో 72 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి
సర్వీసు రోడ్లు నిర్మించాలని కోరుతున్న రైతులు
అండర్ పాస్ బ్రిడ్జ్‌లు తక్కువ ఎత్తు నిర్మించారని విమర్శలు
భూములిచ్చిన రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. సర్వీసు రోడ్లు అభివృద్ధి చేసి రైతులు పంట భూముల్లోకి వెళ్ళడానికి చర్యలు తీసుకోవాలి. రేచర్ల, వేంసూరు, జంగారెడ్డిగూడెం ఎంట్రీ పాయింట్లకు వెళ్ళి తిరిగి రావాలంటే రైతులు అనేక వ్యయ ప్రయాసలకు గురి కావాలి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ పక్కనున్న గ్రామాల ప్రజలకు సైతం రోడ్డు ఎక్కే అదృష్టం లేదు. సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. –కంభం విజయరాజు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్, చింతలపూడి