
ఘర్షణలో వ్యక్తి మృతి
నూజివీడు: గేదెలు కట్టేయడానికి గుంజ పాతే విషయమై ఇద్దరు ఘర్షణ పడగా అందులో ఒకరు మృతి చెందిన సంఘటన నూజివీడు మండలం జంగంగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగంగూడెం ఎస్సీ ఏరియాలో తొమ్మండ్రు ఏసోబు(64), ముళ్లపూడి దేవసహాయం(62) కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో దేవసహాయం స్థలం సరిహద్దులో గుంజను పాతుతుంటే అక్కడ పాతడానికి వీల్లేదంటూ ఏసోబు అడ్డు వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దేవసహాయం భార్య కూడా వచ్చి ఘర్షణకు దిగింది. దేవసహాయం తన చేతిలో ఉన్న గడ్డపలుగును వెనకకు తిప్పి ఏసోబు డొక్కలో పొడవడంతో కింద పడిపోయాడు. ఇదే సమయంలో ఏసోబు భార్య అక్కడికి వచ్చి తన భర్తను ఇంటిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టగా వెంటనే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి రూరల్ ఎస్‌ఐ జ్యోతిబసు సిబ్బందితో గ్రామంలోకి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. తన భర్తను గడ్డపలుగుతో పొడవడంతో మృతిచెందాడని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.