
సాక్షి, ఏలూరు జిల్లా: ఉచిత బస్సు పథకంపై ప్రయాణికులు, కూటమి నేతల్లో అయోమయం నెలకొంది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాలలో నడిచే బస్సులలో ఏ బస్సులో ఫ్రీ టికెట్ ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు ఫ్రీ టికెట్ లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఫ్రీ లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు. జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎంతో జనసేన నాయకుడి ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది. మరోవైపు, రాష్ట్ర వాప్తంగా మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీలు ఇచ్చిన కూటమి సర్కార్.. ఆచరణలో మాత్రం ఆంక్షలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి-తిరుమలకు వెళ్లే బస్సులో యాత్రికులకు షరతులు పెట్టారు. ఉచిత పథకం అమలు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
