
నిండా ముంచిన గోస్తనీ
పెనుమంట్ర: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెనుమంట్ర మండలంలోని గోస్తిని, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాల్వలు పొంగి ప్రవహించడంతో వరి నాట్లు నీట మునిగాయి. గోస్తనీ పరివాహక ప్రాంతంలో నత్తారామేశ్వరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నీట మునగగా, జుత్తిగలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గోస్తనీ మురుగు కాలువలో కిక్కిస, గురప్రు డెక్క పెరిగిపోవడంతో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి ఎస్.ఇల్లిందలపర్రు, మల్లిపూడి, జుత్తిగ, నత్తా రామేశ్వరం వెలగలవారి పాలెం, పెనుమంట్ర, మాముడూరు గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాల్లోని వరినాట్లు నీట మునిగాయి. గోస్తినిలో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని 20 రోజుల క్రితం ప్రారంభించినప్పటికీ నత్త నడకన సాగుతోంది. దీంతో దిగువ భాగంలోని నత్త రామేశ్వరం, జుత్తిగ, వెలగలవారిపాలెం, పెనుమంట్ర, గరువు గ్రామాల మధ్య చెత్త పేరుకుపోయి మురుగునీరు వెళ్లకపోవడంతో పల్లపు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. వరినాట్లు నీట మునిగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చెత్త తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భగ్గేశ్వరం మురుగు కాలువ కూడా ఆక్రమణకు గురై పూడుకుపోవడంతో ఆలమూరు, వెలగలేరు గ్రామాలకు చెందిన పల్లపు పొలాలు నీట మునిగాయి.
నత్తారామేశ్వరంలో ముంపులో శ్రీరామలింగేశ్వర ఆలయం
జుత్తిగ–పెనుమంట్ర మధ్య గోస్తనీలో పేరుకుపోయిన కిక్కిస, గుర్రపు డెక్క

నిండా ముంచిన గోస్తనీ

నిండా ముంచిన గోస్తనీ

నిండా ముంచిన గోస్తనీ