వివాహేతర సంబంధం.. చులకనగా చూస్తోందని | A married woman killed by her lover in Eluru district - Sakshi
Sakshi News home page

మహిళతో వివాహేతర సంబంధం.. చులకనగా చూస్తోందని

Aug 29 2023 12:56 AM | Updated on Aug 29 2023 10:33 AM

- - Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరు వన్‌టౌన్‌ దక్షిణపు వీధిలోని ఒక ఇంట్లో వివాహిత దారుణ హత్యకు గురైంది. మహిళను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతను నూజివీడులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియురాలిని హత్యచేసి తరువాత రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

మహిళ హత్య సమాచారం అందుకున్న ఏలూరు వన్‌టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు కూడా సంఽఘటనా స్థలానికి వెళ్ళి హత్య ఘటనపై ఆరా తీశారు. దిమ్మిట సత్యనారాయణ(35)కు కొంత కాలం క్రితం వివాహం కాగా, భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అతను పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవించేవాడు. శనివారపుపేట గాలిగోపురం ప్రాంతానికి చెందిన ఉడత సుజాత (29)తో పరిచయం ఏర్పడింది. సుజాత భర్త లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుజాత, సత్యనారాయణ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇటీవల సుజాత తనను సరిగా పట్టించుకోవటం లేదని, చులకనగా చూస్తుందంటూ సత్యనారాయణ కక్ష పెంచుకున్నాడు. సుజాతను తన ఇంటికి రప్పించుకుని.. చాకుతో గొంతుకోసి ఆదివారం రాత్రి హత్య చేసి ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని ఏలూరు డీఎస్పీ తెలిపారు.

చులకనగా చూడడం వల్లే..
ముందుగా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు రైల్వే బ్రిడ్జి వద్ద రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు అతడి ప్యాంట్‌ జేబును పరిశీలించగా తన అడ్రస్‌తో కూడిన ఉత్తరం, సూసైడ్‌ నోట్‌ లభించాయి. రైల్వే పోలీసులు ఏలూరులోని సత్యనారాయణ బంధువులకు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం ఇచ్చారు.

అనుమానంతో బంధువులు ఇంటికి వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడడంతో మహిళ హత్యకు విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్ళి విచారణ చేశారు. తనను చులకనగా చూడడం, సరిగ్గా పట్టించుకోకపోవటంతో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో ఉందని తెలుస్తోంది. వన్‌టౌన్‌ సీఐ ఎన్‌.రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement