ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు
భీమవరం : ఎరువులను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించకూడదని జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో భీమవరం సబ్ డివిజన్ పరిధిలోని భీమవరం, పాలకోడేరు, వీరవాసరం మండలాల ఎరువుల డీలర్లకు, కోపరేటివ్ సొసైటీ సెక్రటరీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత డీలర్లపై ఎఫ్‌సీఓ 1985 యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను రైతులకు అందుబాటు ధరల్లో అందించాలన్నారు. ఎరువులు వచ్చిన వెంటనే రిజిస్టర్ నమోదు చేయడం, అమ్మిన, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ కె.శ్రీనివాసరావు, ఏఓలు వైవీఎస్ ప్రసాద్, బి.సంధ్య, బిన్సిబాబు, డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనుమంతరావు, డీలర్లు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పర్యావరణ హితమైన పరిశ్రమల స్థాపనకు నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమావేశంలో వివరించారు. అనంతరం కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో ఓ మద్యం షాపు వద్ద కొనడానికి వెళ్లగా అదనంగా రూ.20 తీసుకున్నారని, ఎందుకని ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం మంగళవారం రాత్రి మోకా వెంకట్ తన మిత్రుడైన పాలా సీతయ్యను మద్యం బాటిల్ తీసుకురమ్మని రూ.200 ఇచ్చాడు. బస్టాండ్ వద్ద షాపు వద్దకు వెళ్లి రూ.120 బాటిల్ అడిగాడు. అయితే రూ.140 తీసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా.. షాపులో ఉన్న వ్యక్తి సిండికేట్ పెంచమన్నారని తెలిపాడు. ఇలా దోచేస్తారా అని సీతయ్య ప్రశ్నించాడు. ఇంతలో షాపు లోపల ఉన్న మరో వ్యక్తి బయటకు వచ్చి సీతయ్యపై దాడి చేశాడు. నీకు దిక్కున్నచోట చెప్పుకో.. ఎవడొస్తాడో చూస్తానని బెదిరించాడు. ఇచ్చిన బాటిల్‌పై ఉన్న సీల్‌ను కూడా తీసేసి ఇచ్చారని సీల్ ఎందుకు తీసేశారో తెలియదని అన్నారు. దీంతో వెంకట్ కేసు పెట్టడానికి సిద్దమయ్యాడు. తమకు తెలుగుదేశం అంటే ప్రాణమని అదనంగా రూ.20 ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే కొట్టేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. టీడీపీ ప్రభుత్వంలో తగిన గుణపాఠం చెప్పారని ఆవేదన వ్యక్తంచేశాడు.
పోలవరం రూరల్: పోలవరం మండలం కోండ్రుకోటలో పునరావాస కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో యోగేష్ పైథాంకర్ పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. పునరవాస కేంద్రంలోని నిర్వాసితుల కాలనీ, పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్లు, సచివాలయం పరిశీలించారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును గమనించి తెలుసుకున్నారు. నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, పౌష్టికాహారం పరిశీలించారు. గ్రామ సచివాలయాల్లో నిర్వాసితులకు అందుతున్న సౌకర్యాలు, అందిస్తున్న ఉద్యోగుల సేవలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల సమస్యలను కూడా తెలుసుకున్నారు.
ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు


