ఇసుక బంద్
సమ్మె కొనసాగుతుంది
వేధింపులు ఆపాలి
● ర్యాంపుల్లో అదనపు వసూళ్లు నిలిపివేసి నిర్ణీత ధరకే లోడింగ్ చేయించాలి
● లోడింగ్ ధరల పట్టికలు ఏర్పాటుచేయాలి
● జరిమానాలు రద్దుచేయాలి. లేనిపక్షంలో బిల్లు ఇవ్వకుండా లోడింగ్ చేస్తున్న ర్యాంపు నిర్వాహకులకు జరిమానాలు వేయాలి.
● ఆధార్‌పై ఆఫ్‌లైన్/ఆన్‌లైన్‌లో రోజువారీ సాండ్ బిల్లు ఇచ్చే వెసులుబాటు కల్పించాలి.
● టాస్క్‌ఫోర్సు పేరిట మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి.
● గతంలో మాదిరి అదనపు రెండు మూడు టన్నులకు మినహాయింపు నివ్వాలి.
సాక్షి, భీమవరం: ర్యాంపుల్లో అనధికార వసూళ్లు ఆపాలని, ధరల పట్టికలు ఏర్పాటుచేయాలని, అక్రమ జరిమానాలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్వారీ లారీ అసోసియేషన్ తలపెట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో ఇసుక కోసం వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని 2 వేల క్వారీ లారీలు ఉన్నాయి. అధిక శాతం ఇసుక రవాణ ద్వారానే వీటికి పని దొరికేది. ఒక్కో లారీపై ఓనర్, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు చొప్పున ఐదు వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లాలోని సిద్దాంతం, నడిపూడి తదితర ర్యాంపులు సీఆర్‌జెడ్ పరిధిలోకి వెళ్లి మూతపడటంతో ఏడాది కాలంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పెండ్యాల, తీపర్రు, జొన్నాడ, కొవ్వూరు, కపిలేశ్వరపురం తదితర ర్యాంపుల నుంచి ఇసుక రవాణ చేస్తున్నారు.
ఉచిత ఇసుక పాలసీలో ర్యాంపు నిర్వాహకుల అక్రమాలతో లారీ యజమానులు నష్టపోవాల్సి వస్తుంది. ఇసుక ఉచితమని, ర్యాంపుల్లో కేవలం లోడింగ్ చార్జి చెల్లిస్తే సరిపోతుందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ర్యాంపుల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోందని లారీ ఓనర్లు అంటున్నారు. ఆరు యూనిట్లు లారీకి ఇసుక లోడింగ్ నిమిత్తం రూ.1,900 చెల్లిస్తే సరిపోతుంది. బిల్లు కావాలంటే అదనంగా రూ.3,600 కలిపి రూ.5,500, బిల్లు లేకుండా అయితే రూ.4,500 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. అదనపు మొత్తం ఎవరి జేబుల్లోకి వెళుతుందో తెలీదు కాని భారం మాత్రం ప్రజలపైనే పడుతోందని యూనియన్ నాయకులు అంటున్నారు. లారీకి 18 టన్నులకు సరిపడా ఇసుక లోడింగ్ చేసేందుకు ర్యాంపుల వద్ద వే బ్రిడ్జిలు ఏర్పాటుచేసుకోవాల్సి ఉండగా ఉజ్జాయింపుగా లోడింగ్ చేస్తున్నారని, మూడు నాలుగు టన్నులు అదనంగా ఉంటే తనిఖీల్లో అధికారులు తమపై కేసులు నమోదు చేస్తున్నారంటున్నారు. ప్రజలకు చేరేదేనన్న భావనతో రెండు మూడు టన్నులు అదనంగా ఉన్నా గతంలో మినహాయింపు ఇచ్చేవారన్నారు. అప్పట్లో బిల్లు లేకుండా రవాణ చేసే లారీలకు రూ.25 వేల వరకు పెనాల్టీలు వేసేవారని, ఇప్పుడు ఇసుక ఉచితమే అయినప్పటికి అదే భారీ మొత్తంలో జరిమానాలతో మైనింగ్ అధికారులు వేధిస్తున్నారన్నారు. బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ర్యాంపుల నిర్వాహకుల జోలికి మాత్రం పోవడం లేదని, వారు వే బ్రిడ్జిలు పెట్టకపోయినా తమపైనే కేసులు నమోదుచేస్తున్నారని విమర్శిస్తున్నారు. కొవ్వూరు – పెరవలి మధ్య టాస్క్‌ఫోర్సు అధికారుల పేరిట కొందరు మైనింగ్ ఉద్యోగులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. సాండ్ బిల్లుకు సంబంధించిన సాప్ట్‌వేర్ సరిగా పనిచేయక లారీకి వారం పదిరోజులకు ఒక్క బిల్లు మాత్రమే వస్తుండటంతో రోజువారీ ట్రిప్పులకు ఇబ్బంది కలుగుతోందంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీ నుంచి టిప్పర్ లారీల్లో ఇసుక రవాణ నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు.
ఇసుక కొరతతో ఇక్కట్లు
ఐదు రోజులుగా ఇసుక రవాణ నిలిపివేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక కొరతతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. లారీల స్ట్రైక్‌తో ఇసుక దొరక్క పనులు ఆపుకోవాల్సి వస్తుందని వినియోగదారులు అంటున్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమ్మె కొనసాగితే సమస్య తీవ్రమై పండుగ రోజుల్లో పనులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కదలని క్వారీ లారీ
సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి జిల్లా క్వారీ లారీ యూనియన్ పోరుబాట
ఐదు రోజులుగా సమ్మెలోనే క్వారీ లారీలు
ఇసుక దొరక్క వినియోగదారుల ఇక్కట్లు
జిల్లాలో రెండు వేల క్వారీ లారీలు, వాటిపై ఆధారపడ్డ కుటుంబాలు ఐదు వేలు
న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా అధికారులను కలిసి వినతులు అందజేశాం. చర్చలు ఇంకా ఫలించకపోవడంతో సమ్మె కొనసాగుతుంది.
– రావూరి రాజా, ఉమ్మడి జిల్లా క్వారీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు
ర్యాంపుల వద్ద కాటాలు ఉండటం లేదు. బిల్లులు ఇవ్వడం లేదు. వాళ్లని వదిలేసి లారీలపై కేసులు కడుతున్నారు. జురిమానాలు రద్దుచేయాలి. టాస్క్‌ఫోర్సు పేరిట అధికారులు వేదింపులు ఆపాలి.
– కోలా సత్యనారాయణ, భీమవరం టిప్పర్ లారీ యూనియన్ అధ్యక్షుడు
ఇసుక బంద్
ఇసుక బంద్
ఇసుక బంద్


