మారని ఎమ్మెల్యే నాయకర్ తీరు
● పట్టణ ప్రథమ పౌరురాలిని అవమానించిన వైనం
● కార్యక్రమం బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ నేతలు
స్వచ్ఛంద సంస్థ సాయం చేస్తుంటే దానిని ఎమ్మెల్యే నాయకర్ రాజకీయం చేయడం దారుణమని అన్నారు. బుధవారం రాత్రి ఆమె తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమను అవమానించడం సరికాదన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తమను ఆహ్వానించిన కార్యక్రమంలో పొట్రోకాల్ పాటించలేదని తప్పుపట్టారు. వైఎస్సార్‌సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ నాయకులు ఉంటే చెక్కుల పంపిణీ చేయనని సంస్థ ప్రతినిధులను బ్లాక్‌మెయిల్ చేశారన్నారు. తుపాను సమయంలో టీడీపీ ప్రభుత్వం రూపాయి సాయం చేయలేదని, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ సొమ్ములు ఇస్తే వారి ప్రభుత్వ చేతకానితనం బయటపడుతుందదనే భయంతోనే ఎమ్మెల్యే బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
నరసాపురం: పట్టణ ప్రథమ పౌరురాలు, నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రొటోకాల్ అంశంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీరు మారడం లేదు. తాజాగా బుధవారం సాయంత్రం పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌లో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణను, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే అవమానించారు. కార్యక్రమానికి సంస్థ ప్రతినిధుల ఆహ్వానం మేరకు అతిథులుగా వెళ్లిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లును వేదికపైకి పిలుస్తుంటే నిర్వాహకులకు వద్దని వారించి ఎమ్మెల్యే ఒక్కరే చెక్కులు పంపిణీ చేశారు. దీంతో చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒంగోలుకు చెందిన సినార్డ్ సంస్థ మోంథా తుపాను బాధిత కుటుంబాలకు రూ.1.12 కోట్ల విలువచేసే నగదు, రూ.2 వేలు విలువచేసే కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చైర్‌పర్సన్‌తో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లును ఆహ్వానించారు. ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌ను కౌన్సిలర్లను చూడగానే నిర్వహకులను పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. తరువాత ఆయన ఒక్కడే వేదిక ఎక్కి చెక్కులు పంపిణీ చేసి వెళ్తుండగా.. చైర్‌పర్సన్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని, కౌన్సిలర్లు యర్రా శ్రీను, సిర్రా కాంతమ్మలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఇది స్వచ్ఛంధ సంస్థ కార్యక్రమమా? లేక మీ పార్టీ కార్యక్రమామా? అని ప్రశ్నించారు. పట్టణ ప్రథమ పౌరురాలికి గౌనవం ఇవ్వరా అన్నారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు అంబేడ్కర్ భవన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.


