సాక్షి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ బీమా పథకానికి ఆదిలోనే సాంకేతిక చిక్కులు తప్పడం లేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరిగా ఇస్తామని సర్కార్ చెబుతున్నా ఆన్లైన్ పోర్టల్ మాత్రం ససేమిరా అంటోంది. దరఖాస్తు చేస్తుంటే ఒక సమ స్య.. నామినీని నమోదు చేయాలంటే మరో సమ స్య.. దరఖాస్తు విజయవంతమైనా రసీదు పొందాలంటే ఇంకో తంటా... ఇలా ఒక్కో దశలో ఒక్కో కొర్రీతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్‌లో రెండు లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉంటే ఇప్పటివరకు మూడు వేల మందికిపైగా దరఖాస్తులు క్లియర్ చేశారు. ఈ సమయంలోనే లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేస్తున్న సమయంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి.
నిరక్షరాస్యులకు మొబైల్ లింకులే దిక్కా..?
పట్టణాలు, గ్రామాల్లో చాలామంది పేద కుటుంబాల వద్ద ఇప్పటికీ స్మార్ట్ఫోన్లు లేవు. కొందరి వద్ద చిన్న కీబోర్డు ఫోన్లే ఉన్నాయి. మరికొందరు నిరక్షరాస్యులు కావడంతో మొబైల్ సందేశాలు చదవ డం, లింకులు తెరవడం కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారికి బీమా దరఖాస్తు విజయవంతమైన తర్వాత ప్రింట్ రసీదు ఇవ్వకుండా ఫోన్‌కు మెసేజ్, లింక్ వస్తుందని చెప్పి పంపిస్తే ఎలా? ఆ లింక్‌ను తెరిచి రసీదు డౌన్లోడ్ చేసుకోవడం వారికి సాధ్యమేనా? పొరపాటున ఆ సందేశం డిలీట్ అయితే మళ్లీ రసీదు పొందే అవకాశం ఉంటుందా? అన్న అంశాలపై స్పష్టత ఉండడం లేదు. ఇక.. ప్రతి లబ్ధిదారుడికి తప్పనిసరిగా ముద్రిత రసీదు అందించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
గ్రేటర్ వరంగల్‌లోని చార్బౌలిలో ఒక రేషన్‌కార్డులో భార్య వయస్సు 55 ఏళ్లు, భర్త వయస్సు 64 ఏళ్లు ఉండగా వారి బీమా దరఖాస్తు సైట్ తీసుకోలేదు. భార్యకు బీమా చేయించేందుకు భర్తను నామినీగా నమోదు చేయాలని ప్రయత్నిస్తే ఆయన వయస్సు 59 ఏళ్లు దాటిందనే కారణంతో స్వీకరించలేదు.
(బీమా పొందే వ్యక్తికి ఒక వయోపరిమితి ఉండటం వేరు.. నామినీగా ఉండే వ్యక్తికీ అదే వయోపరిమితి విధించడం వేరు. నామినీగా ఉండటానికి 59 ఏళ్ల పరిమితి ఎందుకు? 60, 64 ఏళ్ల వయస్సున్న కుటుంబ సభ్యులు నామినీలుగా ఉండకూడదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.)
వరంగల్ 26వ డివిజన్లో మరో విచిత్రమైన సమస్య వెలుగుచూసింది. ఒక కుటుంబంలో తండ్రి వయస్సు 65ఏళ్లు, తల్లి వయస్సు 60 ఏళ్లు ఉండగా, వారికి ఉన్న ఏకై క సంతానానికి 30 ఏళ్లు ఉంది. అతడికి బీమా చేయించాలని ప్రయత్నిస్తే తల్లిదండ్రులిద్దరూ 59 ఏళ్ల వయోపరిమితి దాటడంతో వారిని నామినీలుగా పోర్టల్ అంగీకరించడం లేదు.
(ఇతరులను నామినీలుగా నమోదు చేయాలంటే భవిష్యత్‌లో బీమా ద్వారా వచ్చే ప్రయోజనం తమ తల్లిదండ్రులకు కాకుండా ఆ వ్యక్తులకే వెళ్లిపోతుందేమోనని ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.)
24వ డివిజన్లో రేషన్‌కార్డులో భార్యాభర్తల పేర్లు ఉన్నాయి. భర్త చనిపోవడంతో ఆమె సింగిల్‌గానే ఉండడంతో బీమా చేయించుకునేందుకు వచ్చారు. ఆమె పేరు మీద బీమా చేయించుకునేందుకు మరో వ్యక్తిని నామినీగా నమోదు చేయాలని ప్రయత్నిస్తే పోర్టల్ అంగీకరించడం లేదు.
(రేషన్‌కార్డులో సింగిల్‌గా ఉన్న వ్యక్తికి బీమా రావడం కష్టమేనని బాధితులంటున్నారు.)
● దరఖాస్తు ప్రక్రియ విజయవంతమైన తర్వాత ప్రింట్ తీసుకునే సమయంలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మూడో దశలో ప్రింట్ తీసుకునేలోపే అప్పుడప్పుడు వెబ్సైట్ నిలిచిపోతోంది. మళ్లీ వెబ్సైట్లోకి వెళ్లి రెండోసారి ప్రింట్ తీసుకునే అవకాశం లేకపోవడంతో వార్డు అధికారుల వద్ద సమర్పించాల్సిన పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. విజయవంతమైన దరఖాస్తులకు తిరిగి ప్రింట్ తీసుకునే సదుపాయం కల్పించాలంటున్నారు.
● సర్కారు ఇప్పటికే నామినీల వయస్సు ఎంతున్నా ఫర్వాలేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. రేషన్‌కార్డులో ఒక్కరే ఉన్నా ఇతర అర్హులైన వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. నామినీ వయోపరిమితిని పునఃపరిశీలించి, 59 ఏళ్లు దాటిన వారినీ నామినీలుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి.
● మైనర్లకు చట్టబద్ధ సంరక్షకుడి వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించాలి. ఇందిరమ్మ పోర్టల్‌పై ఉన్నతా ధికారులు సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తేనే లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందంటున్నారు.
ఇందిరమ్మ బీమా ఆన్లైన్ దరఖాస్తులు ఆగమాగం
సింగిల్‌గా ఉన్న వాళ్లకు, నామినీలకు 59 ఏళ్లు దాటినా తీసుకోని పోర్టల్
లాగిన్‌లో ఎంట్రీ, సేవ్ అయ్యాక ప్రింట్ తీయకపోకపోవడంతో నో సేవ్
గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు
సమస్యలు వెలుగులోకి..
కొందరు లబ్ధిదారుల చేతిలో స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో తిప్పలు


