బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

Nov 24 2026 1:12 AM | Updated on Nov 24 2026 1:12 AM

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

హసన్‌పర్తి: ప్రజలకు పోలీస్‌శాఖపై నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సూచించారు. ఇటీవల నియామకాల్లో డీఎస్పీలుగా ఎంపికై 24 వారాల పాటు శిక్షణ కోసం వరంగల్‌ కమిషనరేట్‌కు వచ్చిన దారవత్‌ సబిత, పల్లేటి సాయి ప్రత్యూష్‌రెడ్డి, రుషిరెడ్డి, శంతన్‌కుమార్‌రెడ్డి, రావిరాల యశస్విని ప్రొబేషనరీ డీఎస్పీలు సోమవారం సీపీ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సీపీ వారికి పోలీస్‌శాఖ పనితీరు, విధులు నిర్వహణపై పలు సూచనలిచ్చారు.

29న జిల్లాస్థాయి

చెస్‌ పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: వరంగల్‌ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 29న అండర్‌–7,9,11,13,15 జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ దేశాయిపేట రోడ్డులోని ఒయాసిస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు 1 జనవరి 2011 ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఇందులో గెలుపొందిన బాలబాలికలకు ట్రోఫీలు, ప్రశంసపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

జాతీయస్థాయి పోటీలకు

సాత్విక ఎంపిక

నెక్కొండ: జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు మండల కేంద్రంలోని టీజీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థిని బోళ్ల సాత్విక ఎంపికైందని ప్రిన్సిపాల్‌ మమత తెలిపారు. ఈ మేరకు సోమవారం గురుకులంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీ పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ మాజీ మెంబర్‌ గటిక అజయ్‌కుమార్‌ సాత్వికను అభినందించి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. అప్పల్‌రావుపేటకు చెందిన సాత్విక షూటింగ్‌ పోటీలకు ఎంపికవడం మండలానికి గర్వకారణమన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మైన్పూరిలో జరిగే జాతీయస్థాయి జూనియర్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొననుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఈటీ కమలకుమారి, బీఆర్‌ఎస్‌ నాయకులు సారంగపాణి, వీరస్వామి, శ్రావణ్‌కుమార్‌, అభియాదవ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అమీనాబాద్‌ మోడల్‌ స్కూల్‌

విద్యార్థిని రాజేశ్వరి..

చెన్నారావుపేట: అమీనాబాద్‌ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లకావత్‌ రాజేశ్వరి జాతీయస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ చిట్టె జ్యోతి తెలిపారు. ఈ నెల 15,16 తేదీల్లో పర్వతగిరి మండలం అన్నారంలోని పల్లవి స్కూల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఆమె మంగళవారం ఉత్తరప్రదేశ్‌కు బయలుదేరనున్నట్లు తెలిపారు.

హన్మకొండ: పంచారామాల దర్శనానికి టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పంచరామాలైన అమరావతిలోని అమరేశ్వరాలయం, భీమవరంలోని సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరాలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం, సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వరాలయం దర్శించుకోనున్నట్లు ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత తెలిపారు. చార్జి రూ.2,300గా నిర్ణయించినట్లు తెలిపారు. హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చన్నారు. సూపర్‌ లగ్జరీ బస్సు ఈనెల 28న రాత్రి 7 గంటలకు హనుమకొండ నుంచి బయల్దేరుతుందని, పంచారామాల దర్శనానంతరం తిరిగి 30న హనుమకొండకు చేరుకుంటారని పేర్కొన్నారు. డిసెంబర్‌ 5న మరో ప్రత్యేక సర్వీస్‌ అందుబాటులో ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement