ఇందిరమ్మ బీమాతో ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ బీమాతో ఆర్థిక భరోసా

Nov 24 2026 1:12 AM | Updated on Nov 24 2026 1:12 AM

సంగెం: ఇందిరమ్మ బీమాతో ఆర్థిక భరోసా లభిస్తుందని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆశాలపల్లిలోని కూచన గార్డెన్స్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవం, సంగెం, గీసుకొండ, 15,16,17 డివిజన్ల పరిధిలోని సర్పంచ్‌లు, రేషన్‌ డీలర్లకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబంలోని ఆడబిడ్డకే న్యాయం చేయలేని వారు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సొంత చెల్లెలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేని కేటీఆర్‌ మహిళల సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పుల గురించి మాట్లాడాలని అన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు మాత్రమే వర్తింపజేసిన ఈ పథకాన్ని ప్రజాప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు వర్తింపజేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఆన్‌లైన్‌లో జీవిత బీమా నమోదును పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, మేర కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ వెంకట్రాజం, మండల ప్రత్యేకాధికారి రమేశ్‌, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి, ఎంపీడీఓలు రవీందర్‌, శ్రీధర్‌, తహసీల్దార్లు రాజ్‌కుమార్‌, రియాజొద్దీన్‌, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్లు విజయ, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలపై

ప్రజలకు అవగాహన కల్పించాలి

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య,

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement