జిల్లాలో స్వచ్ఛ విద్యాలయాల స్వీయ రేటింగ్ పూర్తి
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) కార్యక్రమంలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాస్థాయి గుర్తింపు కోసం ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. మొత్తం 832 పాఠశాలల్లో స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) కార్యక్రమంలో పాల్గొని స్వీయ రేటింగ్‌లో పోటీపడ్డాయి. ఈ పాఠశాలలు ఆగస్టు 1 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్‌హెచ్‌వీఆర్. ఎడ్యుకేషన్. జీవోవీ. ఇన్ యాప్‌లో స్వీయ మూల్యాంకనాన్ని అక్టోబర్ నెల వరకు పూర్తి చేశారు. స్వీయ మూల్యాంకన కేవలం 5 స్టార్ పొందిన 34 పాఠశాలలను మాత్రమే ఈనెల 16, 17, 18 తేదీల వరకు ప్రత్యక్షంగా ఉపాధ్యాయ బృందం సందర్శించి స్వీయ మూల్యాంకన స్టార్ అంచనాను నిర్ధారించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వీటిలో 8 పాఠశాలలను మాత్రం జిల్లా స్థాయికి గుర్తిస్తారు. ఈ పాఠశాలలే రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక చేయనున్నారు.
రెండు కేటగిరీల్లో ఎంపిక
జిల్లాలో ఎంపిక చేయనున్న ఎనిమిది పాఠశాలలను రెండు కేటగిరీలుగా విభజించారు. బాలవాటిక నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలల కేటగిరీలో మూడు గ్రామీణ, ఒక పట్టణ పాఠశాలను ఎంపిక చేస్తారు. 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలల కేటగిరీలోనూ మూడు గ్రామీణ, ఒక పట్టణ పాఠశాలను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా ఆరు గ్రామీణ, రెండు పట్టణ పాఠశాలలకు అవకాశం కల్పిస్తారు. ఎంపికకు కనీసం 51 శాతం స్కోరు (త్రీ స్టార్ రేటింగ్ లేదా అంతకంటే ఎక్కువ) తప్పనిసరిగా సాధించాలి.
జిల్లా స్థాయి పరిశీలన బృందాలు
స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) కార్యక్రమంలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాస్థాయి గుర్తింపు కోసం పాఠశాలలు ఆన్‌లైన్‌లో సమర్పించిన స్వీయ మూల్యాంకన వివరాలను పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను నిర్ధారిస్తారు. ఈ బృందంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం, గెజిటెడ్ హెచ్‌ఎంలను ఎంపిక చేశారు. వీరు తమ కాంప్లెక్స్ పరిధి పాఠశాలలు కాకుండా ఇతర కాంప్లెక్స్ పరిధిలోని స్టార్ పొందిన పాఠశాలలను క్షేత్రస్థాయిలో భౌతిక తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను నిర్ధారిస్తారు.
జిల్లాలో స్వీయ రేటింగ్ పాఠశాలల వివరాలు
నేటి నుంచి క్షేత్రస్థాయిలో
పరిశీలించనున్న అధికారులు
జిల్లా, రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్న 8 పాఠశాలలు
కనీసం 51 శాతం స్కోరు సాధించిన పాఠశాలలకే గుర్తింపు


