సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ పదవీ చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగిన బస్వరాజు సారయ్య పదవీకాలం శనివారం ముగిసింది. దీంతో తదుపరి అవకాశం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతల పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు తాజా మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మరోసారి తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో ఉండగా.. మరోవైపు ఎన్నాళ్లుగానో ఎమ్మెల్సీ పదవీపై ఆశలు పెట్టుకున్న కొండా మురళి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇతర నియోజకవర్గాల నేతలు సైతం లాబీయింగ్ చేస్తుండడంతో ఉత్కంఠ రేపుతోంది.
మళ్లీ సారయ్యకేనా?
బస్వరాజు సారయ్యకు రాజకీయ అనుభవంతోపాటు పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు అవకాశం దక్కుతుందన్న ఆశాభావంతో సారయ్య ఉన్నట్లు ఆయన అనుచర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, పార్టీకి చేసిన సేవలు తనకు అనుకూలిస్తాయని ఆయన వర్గీయులు లెక్కలు వేసుకుంటున్నారు.
కొండా మురళి ఆశలు..
మరోవైపు కొండా మురళి కూడా ఎమ్మెల్సీ పదవి పై చాలాకాలంగా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై కొండా కుటుంబం నుంచి పలుమార్లు సంకేతాలు వెలువడ్డాయి. ముఖ్యంగా కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో, అనంతరం పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్న డిమాండ్‌ను బహిరంగంగానే వినిపించారు. ఆమె కుమార్తె కొండా సుస్మితాపటేల్ సైతం ఇదే అంశంపై తనదైన శైలిలో స్పందించడం అప్పట్లో రాజకీయంగా చర్చకు దారితీసింది. దీంతో ఎమ్మెల్సీ పదవిని కొండా కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. మురళికి పదవి దక్కితే కుటుంబానికి రాజకీయంగా మరింత బలం చేకూరుతుందని అనుచరులు భావిస్తున్నారు.
మౌనం వెనుక మర్మమేంటి?
ఇటీవలి రాజకీయ పరిణామాలు కొండా కుటుంబానికి కొంత ఇబ్బందికరంగా మారాయన్న చర్చ సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తర్వాత రాజకీయ సమీకరణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అప్పటినుంచి కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, బహిరంగ రాజకీయ వ్యాఖ్యలకు సైతం కొంత విరామం ఇచ్చింది.
అధిష్టానం లెక్కలే కీలకం..
ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకోవడం, ఇద్దరికీ వేర్వేరు రాజకీయ బలాలు ఉండడం ఆసక్తిని పెంచుతోంది. పార్టీ విధేయత, గత సేవలు, సామాజిక సమీకరణాలు, ప్రస్తుత రాజకీయ అవసరాలు.. ఇలా అనేక అంశాలు అభ్యర్థి ఎంపికలో కీలకం కానున్నాయి. సారయ్యకు మరోసారి అవకాశం కల్పిస్తారా? లేక మురళికి ఈసారి పెద్దపీట వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే వరంగల్ తూర్పు రాజకీయాల్లో ఈ ఇద్దరి పేర్ల చుట్టూ చర్చలు మొదలయ్యాయి. ఒకరికి అవకాశం దక్కితే మరొకరి రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందన్నది కేవలం ఇద్దరు నేతల మధ్య పోటీగానే కాకుండా.. వరంగల్ తూర్పులో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన కీలక పరిణామంగా మారనుంది. ఇంకోవైపు వీరికి కాకుండా ఇతర నియోజకవర్గాల నేతలెవరికై నా అవకాశం ఇస్తారా అన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.
గవర్నర్ కోటాలో ముగిసిన
బస్వరాజు సారయ్య పదవీకాలం
మురళికి ఇవ్వాలంటూ గతంలో
డిమాండ్ చేసిన కొండా సురేఖ
సీఎం రేవంత్‌రెడ్డితో విభేదాల
నేపథ్యంలో కొండా కుటుంబం మౌనం
సారయ్యకు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి అండ
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ


