● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
పర్వతగిరి: భగవాన్ బిర్సాముండా ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు పర్వతగిరిలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొని బిర్సా ముండా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఎం నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి సందేశాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా స్వాతంత్య్ర పోరాటంలో చేసిన సేవలు, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆయన సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. అనంతరం పాఠశాలల్లో అందుతున్న విద్య, బోధన, పౌష్టికాహారం, తదితర వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, డీటీడీఓ నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి: భగవాన్ బిర్సాముండాను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ గణేష్ అన్నారు. మండలంలోని మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన బిర్సా ముండా జయంతిలో పాల్గొని మాట్లాడారు. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


