ఖానాపురం/నర్సంపేట రూరల్: భూములకు సంబంధించిన సర్వేలు వందేళ్ల తర్వాత మళ్లీ చేస్తున్నామని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఖానాపురం మండలం రాగంపేట, నర్సంపేట మండలం రామవ రంలో ఆదివారం భూముల రీసర్వేపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ నిజాం ప్రభుత్వ హయాంలో సర్వేలు చేశారన్నారు. జిల్లాలో 192 గ్రామ పంచాయతీలు ఉండగా మొదటి దఫాలో 70 గ్రామ పంచాయతీల్లో రీసర్వేలు ప్రారంభించామన్నారు. నవంబర్ వరకు మొదటి దఫా రీసర్వేలు పూర్తి చేయాలని, డిసెంబర్ చివరి వరకు 52 గ్రామాల్లో, జనవరి చివరి వరకు 70 గ్రామాల్లో సర్వేలు పూర్తి చేయాలన్నారు. గ్రామాల మధ్య, రైతుల మధ్య అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సర్వేలో తప్పులు దొర్లితే సెక్షన్ 11 ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సర్వే సమయంలో రైతులు అన్ని వివరాలు తెలుసుకోని సంతకాలు చేయాలన్నారు. రీసర్వేలు జపనీస్ మిషన్ సహకారంతో చేపడుతున్నామని, ఒక ఎకరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, లాండ్స్ అండ్ సర్వే ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్లు నంగునూరి రమేష్, రవిచంద్రారెడ్డి, సర్పంచ్‌లు ఎలగందుల రాజు, అర్ణం అనిత, స్వా మి, గాయత్రి, జీపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి రమ్య, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
భూముల రీసర్వేపై అవగాహన సదస్సు


