కేయూ క్యాంపస్: కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తోందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగరాజన్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ కేంద్రం కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. కేయూలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో విద్యారంగాన్ని కాషాయీకరణ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. హనుమకొండలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ 90 వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్షికోత్సవాల్లో విద్యారంగ సమస్యపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ముమ్మాటికీ విద్యార్థుల పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధులు తగ్గిస్తున్నారని, దేశంలోకి ప్రైవేట్ యూనివర్సిటీలు అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ కోసం పోరాడిన ఏకై క విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ అని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించగా, ఇప్పటి రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బానోతు రఘురావు, రహమాన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్గౌడ్, కార్యదర్శి భాషబోయిన సంతోష్, వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదెల్ల శరత్, నాయకులు వినయ్, భాను తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగం కాషాయీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర
ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి
జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగరాజన్


