నాడు..నేడు మట్టి ప్రతిమలే..
తొమ్మిది
రోజులు
పండుగే..
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు దశాబ్దాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం కొనసాగుతోంది. సుమారు 50 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఎడ్లబండిపై గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతీ ఏడాది ఏటా మట్టితో తయారు చేసిన విగ్రహాలను నిర్వహిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా శిథిలావస్థకు చేరుకోగా.. 2007లో ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించారు. కాలం మారుతున్నా.. ఆలయ రూపురేఖలు మారుతున్నా.. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ అంతే భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ వస్తున్నామని గ్రామానికి చెందిన వీరమాచినేని వెంకటేశ్వరరావు చెబుతున్నారు.
● అంబరాన్నంటేలా వేడుకలు
● సాంస్కృతిక కార్యక్రమాలు
● అప్పుడు సాదాసీదాగా ఇప్పుడు ఆధునిక హంగులతో..
● సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఉత్సవ కమిటీలు, భక్తులు
సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్‌లోని అంబేడ్కర్ నగర్‌లో 1968 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పెయింటర్ దుప్పటి నాగేందర్ చెరువు మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేయగా, స్థానికులతో పాటు రైల్వే కాలనీకి చెందిన ఉద్యోగస్తుల కుటుంబాలతో కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారు. తొమ్మిది రోజులు పూజలతోపాటు కోలాటాలు నాటికల ప్రదర్శనలతో కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించేవారు. నిమజ్జనానికి రైల్వే బాక్సులు మోసుకెళ్లే తోపుడు బండిని వినియోగించి బండిపై విగ్రహాన్ని ఊరేగించి సమీపంలోని రైల్వే బావిలో నిమజ్జనం చేసేవారు. మొదట మట్టి విగ్రహం నిమజ్జనం సమయంలో తోపుడు బండి, డప్పుచప్పుళ్లు ఉండగా తర్వాత ఎడ్ల బండి, బ్యాండ్ మేళం వినియోగించారు. 58 ఏళ్లుగా క్రమం తప్పకుండా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ వేడుకల కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఊరూవాడా ఆధ్యాత్మిక సందడి


