సర్‌ నోటీసు వస్తే భయపడొద్దు | - | Sakshi
Sakshi News home page

సర్‌ నోటీసు వస్తే భయపడొద్దు

Sep 13 2026 12:42 AM | Updated on Sep 13 2026 12:42 AM

సాక్షి, వరంగల్‌: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన అనామలీస్‌, నో మ్యాపింగ్‌ తదితర అంశాలపై ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి. దీంతో పలువురు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నోటీసులందుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హియరింగ్‌లో ఎదురవుతున్న సమస్యలు, సమర్పించాల్సిన ఆధారాల గురించి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు.

ప్రశ్న: నోటీసు అంటే ఓటు తొలగించినట్టేనా?

కలెక్టర్‌: నోటీసు రావడం అంటే ఓటు తొలగించినట్లు కాదు. వివరాల్లో ఏదైనా అనుమానం, అసమతుల్యత లేదా గత సర్‌ వివరాలతో సరిపోలకపోవడం గుర్తించినప్పుడు సంబంధిత వ్యక్తి నుంచి వి వరణ, ఆధారాలు తీసుకోవడానికి నోటీసు ఇస్తారు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

ప్రశ్న: ఎలాంటి కారణాలతో నోటీసులు

వస్తున్నాయి?

కలెక్టర్‌: తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయసు వ్యత్యాసం 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉండడం, 50 సంవత్సరాలకు పైగా ఉండడం, ఓటరు–తాతయ్య/అమ్మమ్మ మధ్య వయస్సు వ్యత్యాసం 40 సంవత్సరాల కంటే తక్కువగా ఉండడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

ప్రశ్న: ఒకే కుటుంబంలో ఆరుగురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా అనుమానాస్పదంగా పరిగణిస్తారా?

కలెక్టర్‌: అది ఆటోమేటిక్‌గా తప్పు అని అర్థం కాదు. వ్యవస్థలో ఒకే వ్యక్తిని తండ్రిగా ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు మ్యాప్‌ చేసిన సందర్భాల్లో డేటా సరైందో కాదో నిర్ధారించడానికి పరిశీలిస్తారు.

ప్రశ్న: నోటీసు అందుకున్న వారు హియరింగ్‌కు ఏ పత్రాలు తీసుకురావాలి?

కలెక్టర్‌: అందరూ ఒకే రకమైన పత్రాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, కుటుంబ సంబంధాలను నిర్ధారించే పత్రాలు ముఖ్యం. జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హత ధ్రువపత్రం, ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్‌ గుర్తింపు పత్రం, శాశ్వత నివాస ధ్రువపత్రం, కుటుంబ రిజిస్టర్‌, ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు పత్రాలు ఉంటే తీసుకురావాలి.

ప్రశ్న: పుట్టిన సంవత్సరాన్ని బట్టి పత్రాల

విషయంలో తేడా ఉంటుందా?

కలెక్టర్‌: ఉంటుంది. 1987 జూలై 1కు ముందు భారతదేశంలో జన్మించిన వారు తమ పుట్టిన తేదీ లేదా పుట్టిన స్థలాన్ని నిర్ధారించే పత్రాన్ని సమర్పించాలి. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్‌ 2 మధ్య జన్మించిన వారికి తమ పత్రాలతోపాటు తండ్రి లేదా తల్లి వివరాలను నిర్ధారించే పత్రాలు అవసరం కావొచ్చు. 2004 డిసెంబర్‌ 2 తర్వాత జన్మించిన వారికి స్వీయ పత్రాలతో పాటు తండ్రి, తల్లి వివరాల ఆధారాలు కూడా సమర్పించాలి..

ప్రశ్న: ిహయరింగ్‌కు వెళ్లకపోతే ఏం చేయాలి?

కలెక్టర్‌: నోటీసును నిర్లక్ష్యం చేయకూడదు. నిర్ణయించిన తేదీ, ప్రదేశాన్ని గమనించి హాజరు కావడానికి ప్రయత్నించాలి. ఏదైనా అనివార్య పరిస్థితి ఉంటే సంబంధిత బీఎల్‌ఓ/ఎన్నికల అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. తమ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, గత జాబితాలోని సమాచారం సరిగ్గా ఉందో ముందుగానే పరిశీలించుకోవాలి.

ప్రశ్న: ఓటర్లకు మీ సూచన ఏమిటి?

కలెక్టర్‌: ‘నోటీసు వచ్చింది.. ఓటు పోయింది’ అని భావించవద్దు. నోటీసు ఉద్దేశం వివరాలను ధ్రువీకరించడమే. నోటీసులోని కారణాన్ని తెలుసుకుని, అ ందుబాటులో ఉన్న సరైన పత్రాలతో హియరింగ్‌కు హాజరుకావాలి. అర్హత ఉన్న ఓటర్ల వివరాలు సక్రమంగా ఉండేలా, అనర్హుల నమోదు లేకుండా ఎస్‌ ఐఆర్‌ను పారదర్శకంగా పూర్తి చేయడమే లక్ష్యం.

జిల్లాలో మొత్తం 1,94,395 నోటీసులు జనరేట్‌ కాగా 1,27,365 డెలివరీ అయ్యాయి. 67,030 నోటీసులు డెలివరీ పెండింగ్‌లో ఉన్నాయి. 12,502 హియరింగ్‌లు నిర్వహించగా, 96,969 హియరింగ్‌ తేదీలు ల్యాప్స్‌ అయ్యాయి. చాలా మంది వీకెండ్‌లలో వస్తామని సమాచారం ఇవ్వడంతో ఏఈఆర్‌ఓల సంఖ్యను పెంచి క్లియర్‌ చేయడంపై దృష్టి సారించారు. మొత్తం పెండింగ్‌ కేసులు 4,828 ఉండగా వీటిని శనివారం కలెక్టర్‌ సత్యశారద నేతృత్వంలోని బృందం క్లియర్‌ చేసింది.

ఆధారాలతో హియరింగ్‌కు రండి

‘సాక్షి’ ఇంటర్వ్యూలో

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement