లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి 29న స్విమ్మింగ్‌ పూల్‌ పునఃప్రారంభం విద్యార్థినిపై వార్డెన్‌ అసభ్యకర ప్రవర్తన కానిస్టేబుల్‌పై విచారణకు ఆదేశం

వరంగల్‌ లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 12న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని న్యాయవాదులు, కక్షిదారులకు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత పిలుపునిచ్చారు. రాజీపడదగు క్రిమి నల్‌, సివిల్‌ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్‌ వెహికిల్‌ యాక్సిడెంట్‌ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్‌ కేసులు, ఎకై ్సజ్‌ కేసులు, ప్రీ–లిటిగేషన్‌ కేసులు, ఇతర కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్‌ అదాలత్‌పై ఎలాంటి సలహాలు, సందేహాలు, సూచనలకు హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందాలని కోరారు. లోక్‌ అదాలత్‌లో భాగంగా హనుమకొండ కోర్టులో 9, పరకాల కోర్టులో 1 బెంచ్‌ ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.

జిల్లాలో మోస్తరు వర్షం

హన్మకొండ: హనుమకొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 వరకు జిల్లాలో సగటున 13.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ధర్మసాగర్‌లో 50.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐనవోలులో 40.1 మిల్లీమీటర్లు, కాజీపేటలో 24.6, హనుమకొండలో 13.5, దామెరలో 11.8, వేలేరులో 10.6, భీమదేవరపల్లిలో 9.6, ఎల్కతుర్తిలో 7.1, కమలాపూర్‌లో 1.6, హసన్‌పర్తిలో 4.2, పరకాలలో 6, ఆత్మకూరులో 6.1, శాయంపేటలో 5, నడికూడలో 3.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కూలిన పాఠశాల ప్రహరీ

ధర్మసాగర్‌: మండల కేంద్రంలోని(పెద్దబడి) బాలుర ఉన్నత పాఠశాల ప్రహరీ వర్షాల ధాటికి కుప్పకూలింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ నానుతూ బలహీనపడడంతో ఒక భాగం పూర్తిగా నేలమట్టమైంది. గోడ కూలిపోవడంతో పాఠశాల ఆవరణకు రక్షణ కరువై విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈఘటనతో పాఠశాల భద్రత ప్రమాదంలో పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకరంగా మారిన మిగిలిన గోడలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, కూలిన స్థానంలో కొత్త కాంపౌండ్‌ గోడను అత్యవసరంగా నిర్మించాలని కోరుతున్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: మరమ్మతుల కారణంగా సుమారు ఏడాది పాటు మూతపడిన హనుమకొండలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ పూల్‌, ఇండోర్‌ స్టేడియాన్ని ఈనెల 29న పునఃప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ చాహత్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

పోక్సో కేసు నమోదు

హసన్‌పర్తి: హాస్టల్‌లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌పై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విధులు నిర్విహిస్తున్న వార్డెన్‌ కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు పాఠశాలకు వచ్చిన నిలదీశారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వార్డెన్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఖిలా వరంగల్‌: మద్యం మత్తులో ఉన్న టీజీఎస్సీ కానిస్టేబుల్‌ను చితకబాదిన మిల్స్‌కాలనీ బీట్‌ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌ కావడంతో దీనిపై ఉన్నతాధికారులు మరింత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement