● మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
● తండ్రి సూచనతోనే కూతురు
మానసను చంపిన వినోద్‌కుమార్
● వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి
ఎల్కతుర్తి : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద ఇటీవల కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు తన మోచెయ్యితో సదరు మహిళను గొంతు నొక్కిపట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడెల్లి వినోద్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన తండ్రి సమ్మిరెడ్డి ఉద్యోగ రీత్యా గోదావరిఖనిలో ఉండడంతో వినోద్‌కుమార్ అక్కడే ఉంటున్నాడు. గోదావరిఖనికి చెందిన అంకతి మానస(35) తనకు చిన్నప్పటినుంచే స్నేహితురాలు కావడంతో ఆమెతో స్నేహంగా ఉంటున్నాడు. కాగా, మానసకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగి విడాకులయ్యాయి. అప్పటినుంచి మానసను తమవద్దే ఉండమని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోకపోయేది. పైగా వారినే ఇబ్బందులకు గురిచేసేది. దీంతో మానస తండ్రి రాజేశం.. నిందితుడు వినోద్‌కుమార్‌తో కలిసి మానసను ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఈక్రమంలో మానస ఈనెల 16న అరుణాచలం వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది. తర్వా తి రోజు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తాను వినోద్‌కుమార్‌తో కరీంనగర్‌లోని తన రూమ్‌లో ఉన్నానని చెప్పింది. 18వ తేదీ తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు వినోద్‌కుమార్‌ను అడిగింది. దీనికి పెళ్లి అవసరం ఏమొచ్చిందని వినోద్ కుమార్ పే ర్కొనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం వినోద్‌కుమార్ మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో రాజేశం ‘అది (కూతురు) భూమి మీద బతికి ఉంటే మమ్మల్ని, నిన్ను ఇబ్బందులకు గురిచేస్తది. దాన్ని ఏదో ఒకటి చేసి.. మాకు బాధలేకుండా చెయ్యి’ అని చెప్పడంతో నిందితుడు వినోద్‌కుమార్.. మానసను మోచెయ్యితో గొంతు నొక్కిపట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి ఎల్కతుర్తి మండల కేంద్రానికి వచ్చి వాహనాన్ని పార్క్ చేశాడు. ఈ క్రమంలో కారు నుంచి దుర్వాసన వస్తోందనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారు డిక్కీ తెరవగా మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈనెల 21న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 23న ఎల్కతుర్తి గ్రామ శివారులోని నాగార్జున సీడ్స్ ప్లాంట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ హత్య కరీంనగర్‌లో జరిగిన నేపథ్యంలో మానస తండ్రిని మరో నిందితుడిగా భావిస్తూ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కేసు అప్పగిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన సీఐ పులి రమేశ్, ఎస్సై నర్సింహారావు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. సీఐ, ఎస్సై, సిబ్బంది విఠల్‌రావు, భాస్కర్‌రెడ్డి, బక్కయ్య, సుమన్, నిరంజన్, మోహన్‌బాబు, రాంలాల్, నీరజ్ పాల్గొన్నారు.


