● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ఈనెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ–26 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీసీపీ దారా కవిత, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి చర్యలు
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్) మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్న కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. సోమవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... జిల్లాలో ఎస్‌ఐఆర్‌లో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న 1.32 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ప్రజావాణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి అధికారులు సమయానికి హాజరు కావాలని, కారుణ్య నియామకాల భర్తీకి శాఖల వారీగా వివరాలు అందించాలని ఆదేశించారు. మంగళవారం నిర్వహించే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి వన మహోత్సవం ఏర్పాట్లపై అధికారులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్‌ఓ శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.


