సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: గంజాయి కేవలం ఒక మత్తు పదార్థం కాదు.. ఆలోచనలు, ప్రవర్తనను, భవిష్యత్‌ను మార్చేసే ప్రమాదకర అలవాటు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈనేపథ్యంలో వరంగల్ శివనగర్‌లోని వందన హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో చదువుతున్న మైనర్లే దారి తప్పడమంటే ఇటు కుటుంబాన్ని, అటు సమాజానికి అన్యాయం చేసిన వారేనని ముక్తకంఠంతో ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దన్నారు.
సరదాగా మొదలై.. శిక్షగా మారొద్దు
పాఠశాల, కళాశాల వయసు జీవితాన్ని తీర్చిదిద్దుకునే సమయమని, అదే సమయంలో చెడు స్నేహాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిడి, ఆసక్తి పేరుతో మొదలయ్యే గంజాయి వంటి మత్తు అలవాట్లు క్రమంగా వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయన్నారు. మత్తులో తీసుకునే నిర్ణయాలు ఒక్క కుటుంబాన్నే కాదు.. సమాజాన్నే విషాదంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే చిన్న మార్పులను కూడా తల్లిదండ్రులు, నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులు సూచించారు. తరచూ గైర్హాజరు కావడం, ఒంటరిగా ఉండడం, చదువుపై ఆసక్తి కోల్పోవడం, అకస్మాత్తుగా స్నేహితులు మార డం వంటి లక్షణాలను గమనించాలి. సమస్య కని పించిన వెంటనే మందలించడం, శిక్షించడం కాకుండా పిల్లలతో ప్రేమగా మాట్లాడి కారణాన్ని తెలుసుకోవాలని కోరారు.
మత్తుపై పోరాటం..
కేవలం పోలీసులతోనే కాదు
రూపారెడ్డి హత్య ఘటనపై పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణను కేవలం పోలీసుల బాధ్యతగా చూడకూడదన్నారు. పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రులు, స్థానిక సంఘాలు, ప్రజాప్రతినిధులు కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ప్రతి విద్యాసంస్థలో కౌన్సెలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్థులకు సరైన మార్గదర్శనం అందించాలని అభిప్రాయపడ్డారు.
స్నేహం పేరుతో జీవితాన్ని ఫణంగా పెట్టొద్దు
ఈ చర్చలో ప్రధానంగా వినిపించిన మరో అంశం స్నేహితుల ప్రభావం. మంచి స్నేహం జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే.. చెడు స్నేహం నేరాల వైపు కూడా నడిపించే ప్రమాదం ఉందని విద్యార్థులు స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను ప్రయత్నించమని ఒత్తిడి చేస్తే ధైర్యంగా తిరస్కరించాలని, అవసరమైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు.
గంజాయితో భవిష్యత్ ఆగం
గంజాయి వాడితే ఏం కాదని కొందరు చెబు తుంటారు. కానీ, చదువుపై ఆసక్తి తగ్గడం, కుటుంబానికి దూరం కావడం, కోపం పెరగడం వంటి మార్పులను మన చుట్టూ చూస్తున్నాం. విద్యార్థులు నిజాలు తెలుసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ వైపు అడుగులు వేయాలి.
– అబ్దుల్ హక్, విద్యార్థి
ముందు సమస్యను గుర్తించాలి
విద్యార్థులు, యువతను శిక్షించడం కంటే ముందే సమస్యను గుర్తించడం ముఖ్యం. పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడే కుటుంబ వాతావరణం ఉంటే చాలా సమస్యలను ముందుగానే పరి ష్కరించవచ్చు. పాఠశాలలు, కళాశాల్లోనూ వి ద్యార్థుల ప్రవర్తనపై అనుమానం వస్తే కౌన్సెలి ంగ్ నిర్వహించాలి. ఇలా అందరి బాధ్యతతో భావి భారత పౌరులను తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.
– ఆడెపు శ్యాం, వందన స్కూల్ ప్రిన్సిపాల్
విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
అవగాహనతోనే
మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట
విద్యార్థులు, ఉపాధ్యాయుల
అభిప్రాయం
ఈ పంచ సూత్రాలు గుర్తుంచుకోవాలి...
స్నేహితుడు ఒత్తిడి చేసినా వద్దు అని చెప్పాలి.
తెలియని పదార్థాలను తినడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు.
అనుమానం కలిగించే విషయం ఎదురైతే వెంటనే పెద్దలకు చెప్పాలి.
మానసిక ఒత్తిడి ఉంటే ఒంటరిగా భరించకూడదు.
తప్పు చేసిన పిల్లలను దూరం చేయకుండా సరైన సాయం అందించాలి.
‘మత్తు క్షణిక ఆనందం ఇవ్వొచ్చు.. కానీ మంచి భవిష్యత్‌ను లేకుండా చేస్తుంది. పిల్లలను కాపాడేది భయం కాదు..
అవగాహన, ఆప్యాయత, మార్గదర్శకమే’
– విద్యార్థులు,
ఉపాధ్యాయలు ఇచ్చిన సందేశం..


